నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు తెరపై హీరోగా కనిపిస్తాడా అని అభిమానులు ఎన్నాళ్ళ నుంచో ఆత్రంగా చూస్తున్నారు. వచ్చే యేడాది మోక్షజ్ఞ తప్పకుండా తెరంగేట్రం చేస్తాడని విశేషంగా వినిపిస్తోంది. అతను చాలా సిగ్గరి, అందువల్లే సినిమాల్లో నటించడం లేదు అనే మాటలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, గురువారం నోవాటెల్ లో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో నందమూరి మోక్షజ్ఞ ‘స్పెషల్ ఎట్రాక్షన్’గా నిలిచాడు. ఆ వేడుకలో వైసీపీ ఎమ్.పి. రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ – మోక్షజ్ఞతో కలసి తీయించుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే – ఫీనిక్స్ గ్రూప్ ఛైర్మన్ చుక్కపల్లి సురేశ్ షష్టి పూర్తి గురువారం నోవాటెల్ లో జరిగింది. ఆ వేడుకలోనే నందమూరి మోక్షజ్ఞ పాల్గొన్నాడు. అక్కడ అందరి చూపు మోక్షజ్ఞ వైపే సాగిందని చూసినవారు చెబుతున్నారు. పెద్దవాళ్ళకు అతను ఎంతో గౌరవమిస్తూ మాట్లాడడం చూడముచ్చటగా ఉందనీ వారన్నారు. మోక్షును విష్ చేసిన వారందరితోనూ అతను మాట్లాడిన తీరు అలరించిందనీ అంటున్నారు. మోక్షజ్ఞ ఎప్పుడు నటిస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం వచ్చే యేడాది తప్పకుండా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో కిలోల బరువు తగ్గిన మోక్షు, త్వరలోనే పర్ ఫెక్ట్ షేప్ కు వస్తాడనీ అంటున్నారు. చిన్నతనం నుంచీ తండ్రి నటన చూస్తూ పెరిగిన మోక్షు జీన్స్ లోనే నటన ఉందని, తప్పకుండా అతను జనాన్ని ఆకట్టుకుంటాడని సన్నిహితులు ఆశిస్తున్నారు. మరి మోక్షజ్ఞ ఎప్పుడు ఏ సినిమాతో జనం ముందుకు వస్తాడో చూడాలి.