ఒకానొక సమయంలో భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగానూ, అత్యధికంగా పన్ను చెల్లించిన నటునిగానూ అక్షయ్ కుమార్ రికార్డ్ సృష్టించారు. ఖాన్ త్రయంగా పేరొందిన ఆమిర్, సల్మాన్, షారుఖ్ దాటికి తట్టుకొని నిలచిన ఘనుడు అక్షయ్ కుమార్. వరుస విజయాలు చూస్తూ సాగిన అక్షయ్ కుమార్ సైతం ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఖాన్ త్రయం సాధించిన స్థాయిలో బ్లాక్ బస్టర్స్ చూడక పోయినా, అక్షయ్ కుమార్ సైతం అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ ముగ్గురూ ఇప్పటి దాకా జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా అవార్డులు అందుకోలేదు. కానీ, అక్షయ్ కుమార్ 2016లో తాను హీరోగా నటించిన ‘రుస్తుమ్’ చిత్రం ద్వారా ఉత్తమ నటునిగా నేషనల్ అవార్డు సంపాదించారు.
అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓమ్ భాటియా. 1967 సెప్టెంబర్ 9న పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. ఆయన తండ్రి హరి ఓమ్ భాటియా మిలిటరీ ఆఫీసర్. దాంతో అక్షయ్ కూడా చిన్నతనం నుంచీ ఎంతో క్రమశిక్షణతో పెరిగారు. అక్షయ్ కి మొదటి నుంచీ స్పోర్ట్స్ అంటే ప్రాణం. ముంబైలోని మాతుంగలో ఉన్న డాన్ బాస్కో హై స్కూల్ లో అక్షయ్ చదివారు. తరువాత గురునానక్ ఖల్సా కాలేజ్ లో చేరారు. కానీ, చదువుపై అంతగా ఆసక్తి లేని అక్షయ్ తన తండ్రిని ఒప్పించి హాంగ్ కాంగ్ కు వెళ్ళి మార్షియల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించారు. తరువాత ఏం చేయాలనుకుంటున్నావని తండ్రి అడగ్గానే తాను యాక్టర్ ను అవుతానని సమాధానమిచ్చారు అక్షయ్. ముంబైలోనే ఓ మార్షియల్ స్కూల్ పెట్టి అక్కడ పలువురికి కరాటే, జూడో నేర్పించసాగారు అక్షయ్. అలా అక్షయ్ దగ్గర మార్షియల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఓ అబ్బాయి తండ్రి అక్షయ్ ను చూసి మోడల్ గా ఎన్నుకున్నారు. తాను నెలంతా కష్టపడితే వచ్చే మొత్తం కేవలం రెండు రోజుల్లోనే లభించడంతో అక్షయ్ కి కూడా నటనలో రాణించాలన్న తపన పెరిగింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జయేష్ సేథ్ తో ఫోటో షూట్ చేయించుకోవాలని ఆశించారు అక్షయ్. అయితే ఆయన డిమాండ్ చేసిన డబ్బు అక్షయ్ వద్ద లేకపోవడంతో 18 నెలలు పైసా తీసుకోకుండా జయేష్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ పై ఆ ఫోటో ఆల్బమ్ పట్టుకొని బాలీవుడ్ లో నటునిగా వేట ఆరంభించారు అక్షయ్. కొన్ని సినిమాల్లో గ్రూప్ డాన్సర్ గానూ చిందులేశారు. తొలుత ‘దీదార్’ అనే సినిమాలో కీ రోల్ కు సైన్ చేశారు అక్షయ్. కానీ, ‘సౌగంధ్’లో అవకాశం వచ్చింది. ఆ సినిమాయే ముందుగా విడుదలయింది. అబ్బాస్ ముస్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం విజయం సాధించడంతో అక్షయ్ కుమార్ కు మంచి పేరు లభించింది. అప్పటి నుంచీ అవకాశాలు ఆయన తలుపు తడుతూ వచ్చాయి. విజయాలూ పలకరించాయి. మరి వెను తిరిగి చూసుకోలేదు.
ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా కూతురు ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు. ట్వింకిల్ అడుగు పెట్టాక అక్షయ్ స్టార్ డమ్ మరింతగా పెరిగింది. అక్షయ్ కుమార్ – కత్రినా కైఫ్ జోడీ పలు చిత్రాలలో అలరించింది. అక్షయ్ కొన్ని సౌత్ మూవీస్ లోనూ నటించారు. రజనీకాంత్ హీరోగా రూపొందిన శంకర్ చిత్రం ‘రోబో 2.0’లో అక్షయ్ కుమార్ విలక్షణమైన పాత్రలో అలరించారు. నిర్మాతగానూ అక్షయ్ సాగారు. అక్షయ్ కుమార్ కు తొలినుంచీ హిందుత్వ అంటే అభిమానం. దాంతో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపారు. అందువల్లే అక్షయ్ కుమార్ సినిమాలు బాగా ఆడేలా చేశారని, ఆయనకు నేషనల్ అవార్డూ ఇచ్చారని కొందరు అంటూఉంటారు. కానీ, అక్షయ్ అంతకు ముందు సాధించిన ఘనవిజయాలకు ఎవరి అండా లేదు కదా! అలాగే ఆయనకు ప్రభుత్వం అండ ఉంటే, ఏదైనా వ్యక్తిగతంగా మేలు జరుగుతుందే తప్ప, అక్షయ్ సినిమాలు ఆడించలేరు కదా!
ఈ యేడాది అక్షయ్ కుమార్ నటించిన “బచ్చన్ పాండే, సమ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్” చిత్రాలు ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి. ఓ వారం క్రితం అక్షయ్ నటించిన ‘కట్ పుత్లీ’ నేరుగా ఓటీటీలో విడుదలయింది. ఈ సినిమా తమిళ చిత్రం ‘రాచ్చసన్’ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం సైతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందనే తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఆశలన్నీ తాను నటించిన ‘రామ్ సేతు’పైనే ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 21న జనం ముందుకు రానుంది. రాబోయే ‘రామ్ సేతు’తో అయినా అక్షయ్ కుమార్ మళ్ళీ జనాన్ని ఆకట్టుకుంటారేమో చూడాలి.