అక్కినేని అందగాడు అఖిల్ కు కెరీర్ లో ఒక్క సరైన హిట్ లేక కిందా మీద పడుతున్నాడు. మొదటి సినిమాతోనే మాస్ హీరో అనిపించుకోవాలని ట్రై చేసినా అది కాస్త బెడిసికొట్టింది. తరువాత లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేసినా అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఒక్క హిట్ ఐనా అందుకోవాలని అఖిల్ కసిమీద కనిపిస్తున్నాడు. అందుకే వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు.
ఇప్పుడు అఖిల్ అక్కినేని ఏం చేస్తున్నారు? సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. మనాలిలో కొన్ని రోజులుగా జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్ శుక్రవారంతో కంప్లీట్ అయ్యింది. అఖిల్ అక్కడ నుంచి తిరిగొచ్చారు. ‘ఏజెంట్’ సంగతి ఓకే. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది?
అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్న మోహన్ రాజా దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేసే అవకాశం ఉందని కొన్ని రోజులుగా వినబడుతోంది. అయితే, ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. తనకు ఫస్ట్ సక్సెస్ అందించిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అఖిల్ అక్కినేని రెడీ అవుతున్నారట.
అఖిల్, భాస్కర్ కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత భాస్కర్ మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ఇటీవల అఖిల్‌ను కలిసి ఒక కథ చెప్పారట. అది హీరోకి నచ్చిందని తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో సినిమా విషయమై మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.