మన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ్ చేసుకుంటున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారకుడైన గాంధీని జాతిపితగా కొలుస్తున్నాం. ఆయన చనిపోయి ఏడు దశాబ్దాలు గడిచినా, మదిలో నిలపుపుకుని కొలుస్తున్నాం. ఆయన బాటలో జాతి జనులు సాగాలను రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా పథకాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ బాబు దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.వై. మహర్షి ‘1948 అఖండ భారత్’ అనే సినిమాను తీసి ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు. పలు భారతీయ భాషల్లోనూ దీనిని అనువదిస్తున్నారు. ఇందులో గాంధీగా రఘనందన్, నాథురాం గాడ్సేగా డా. ఆర్యవర్ధన్ రాజ్, పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రూగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, సరిహద్దు గాంధీ అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ నటించారు.
ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఇందులో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత ఆచంట గోపీనాథ్, విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ నాయకులు శ్రీనివాస్ రాజ్, శివరాములు, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ‘1948 – అఖండ భారత్’ తెలుగువారంతా గర్వపడే చిత్రంగా పేర్కొన్నారు. ‘గాంధీని గాడ్సే చేసింది హత్య కాదని, దేశ విశాల ప్రయోజనాల కోసం చేసిన వధగా భావించేవారు ఇప్పటికీ ఉన్నార’ని వక్తలు అన్నారు. గాడ్సే కోణం వెలుగులోకి రాకుండా దాచిపెట్టిన ఎన్నో విషయాలను ఈ చిత్రంలో నిష్పక్షపాతంగా చూపించారని వివరించారు. ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తీసినట్టు గాడ్సే పాత్రధారి, రచయిత ఆర్యవర్థన్ రాజు చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులలో పునరాలోచన కలుగుతుందని, గాంధీ హత్య వెనుక కారణాలూ తెలుస్తాయని అన్నారు. ‘1948 – అఖండ భారత్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం రావడం పట్ల సంగీత దర్శకుడు ప్రజ్వల క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.

1948 Akhand Bharat