Ajay Bhupathi: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తడాని టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు అజయ్ భూపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన సినిమాలో మోహన్ బాబు పోషిస్తున్న పాత్ర గురించి మాట్లాడుతూ.. “ఈ పాత్ర కోసం కథ రాసేటప్పుడే నా మనసులో మోహన్ బాబు గారి పేరే ఉంది. అంత పవర్‌ఫుల్, హుందాగా ఉండే పాత్రకు తెలుగులో ఆయన కంటే సరైన ఎంపిక మరెవరూ కనిపించలేదు. వేరే భాష నుంచి ఎవరినీ తీసుకురావాలనే ఆలోచన కూడా చేయలేదు” అని తెలిపారు. తర్వాత నిర్మాతలకు ఈ విషయం చెప్పగా, వారు కూడా అంగీకరించారని, మోహన్ బాబును సంప్రదించగానే వెంటనే ఓకే చెప్పారని వెల్లడించారు. “ఆయన అంత పెద్ద నటుడు అయినా, కథ విన్న వెంటనే అంగీకరించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని అజయ్ భూపతి అన్నారు. మోహన్ బాబును “డైరెక్టర్స్ యాక్టర్”గా అభివర్ణించిన అజయ్ భూపతి.. “భారతదేశంలోనే గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఆయన డైలాగ్ డెలివరీ, స్టైల్, హావభావాలు ప్రత్యేకమైనవి. వాటిని ఎవరూ అనుకరించలేరు” అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇదే ఇంటర్వ్యూలో హీరో జయకృష్ణ గురించి ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. “బయటకు చాలా సైలెంట్‌గా కనిపిస్తాడు. కానీ సెట్స్‌లో మాత్రం చాలా నాటీ. మా సినిమా యూనిట్‌లో ఎవరిని అడిగినా ఇదే చెబుతారు” అంటూ నవ్వులు పూయించారు. గతంలో తాను షూటింగ్‌లలో చాలా రిజర్వ్డ్‌గా ఉండేవాడినని, కానీ ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో మాత్రం అందరితో కలిసిపోయి చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. కాగా ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు రషా తడాని టాలీవుడ్ అరంగేట్రం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

