తెలుగులో పలు చిత్రాలలో హీరోగా నటించిన వ్యక్తి స్వర్గీయ రాజేశ్. అతని కుమార్తె ఐశ్వర్య ప్రస్తుతం తమిళనాట పాపులర్ హీరోయిన్. తెలుగులోనూ పలు చిత్రాలలో నటించిన ఐశ్వర్య రాజేశ్ ఇప్పుడు ‘సుడల్’ అనే వెబ్ సీరిస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ‘విక్రమ్ వేద’ దర్శకులు పుష్కర్ – గాయత్రి రూపొందించిన ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ నెల 17న ప్రసారం చేయబోతున్నారు. ఇందులో మొదటి నాలుగు ఎపిసోడ్స్ ను బ్రహ్మ డైరెక్ట్ చేయగా, మిగిలిన నాలుగు ఎపిసోడ్స్ ను అనుచరణ్ చిత్రీకరించారు. ఓ చిన్న పల్లెటూరిలో కనిపించకుండా పోయిన తన చెల్లికోసం ప్రాణాలను పణంగా పెట్టి వెతికులాడే పాత్రను ఐశ్వర్యా రాజేశ్ చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్స్ గా కదిల్, శ్రియా రెడ్డి నటించారు. మరో కీలక పాత్రను నటుడు, దర్శకుడు పార్తీబన్ చేశాడు. ప్రధాన భారతీయ భాషలతో పాటు 240 దేశాలలో వివిధ భాషల్లో ఈ వెబ్ సీరిస్ ను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ వెబ్ సీరిస్ కు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను కూడా మంగళవారం విడుదల చేశారు.