కోలీవుడ్ స్టార్ హీరో ‘ధనుష్’ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అతని సొంత కారణాల వల్ల కాకుండా.. మేనేజర్ వల్ల సోషల్ మీడియాలో నిలిచారు. ధనుశ్ మేనేజర్ శ్రేయాస్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళ టీవీ నటి మాన్య ఆనంద్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. శ్రేయాస్ ఓ కొత్త సినిమా గురించి తనను సంప్రదించారని, కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగారని చెప్పారు. శ్రేయాస్ పదే పదే తనను సంప్రదించేవాడని, తాను సినిమా తిరస్కరించినప్పటికీ స్క్రిప్ట్‌లు పంపేవాడని మాన్య తెలిపారు. మాన్య ఆరోపణలు అభిమానులను షాక్‌కు గురి చేశాయి.
‘హీరో ధనుశ్ మేనేజర్ శ్రేయాస్ ఓ కొత్త సినిమా కోసం నన్ను సంప్రదించారు. సినిమా కోసం కమిట్‌మెంట్ ఇవ్వాలని చెప్పారు. ఎలాంటి కమిట్‌మెంట్?, నేను ఎందుకు కమిట్‌మెంట్ ఇవ్వాలి అని ప్రశ్నించా. సినిమా కోసం షరతులు అంగీకరించడానికి నేను సిద్ధంగా లేనని చెప్పా. ధనుష్ సర్ అయినా మీరు అంగీకరించరా? అని అన్నాడు. శ్రేయాస్ నాకు చాలాసార్లు ఫోన్ చేసి ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్ పంపాడు. నేను తిరస్కరించినప్పటికీ స్క్రిప్ట్ పంపాడు. స్క్రిప్ట్ చదివారా? అని అడిగేవారు. నేను స్క్రిప్ట్ చదవలేదు, ఈ సినిమా చేయడం లేదని చెప్పా. మేము నటులం, నటించడం మా పని. మాకు అవకాశాలు ఇవ్వండి కానీ.. ప్రతిఫలంగా ఏమీ ఆశించకండి. సినీ ఇండస్ట్రీలో ఈ పద్ధతికి ముగింపు పలకాలని నేను కోరుకుంటున్నా’ అని మాన్య ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Chadalavada Srinivasa Rao: అందుకే.. ప్రేక్షకుడు దొంగ దారిలో సినిమా చూస్తున్నాడు!
అదే సినిమా కోసం మరో మేనేజర్ కూడా ఇలాంటి డిమాండ్లతోనే తనను సంప్రదించారని మాన్య ఆనంద్ చెప్పారు. ఆయనకు కూడా తాను నో చెప్పానని కెరీర్‌లో ఎదురైన క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకున్నారు. 30 ఏళ్ల మాన్య తమిళ టీవీ సీరియల్ వనతై పోలా ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. మాన్య ఇంటర్వ్యూ వైరల్ అవుతున్నప్పటికీ.. అటు శ్రేయాస్ కానీ, ఇటు ధనుష్ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.