Gopichand Biopic: ప్రముఖ పంపిణీదారుడు అభిషేక్ నామా… ఏడేళ్ళ క్రితం చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఆయన తాజా చిత్రం ‘రావణాసుర’ శుక్రవారం విడుదలైంది. అయితే దానికి నెగెటివ్ టాక్ రావడంతో…. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు, అలానే విడుదలకు రెడీ అవుతున్న చిత్రాలు, ఇప్పటికే ప్లానింగ్ లో ఉన్న మూవీస్ పరిస్థితి ఎలా ఉండబోతోందోననే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే…. ఏడేళ్ళ క్రితం అభిషేక్ నామా భారీ పథక రచనతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
ఒకేసారి ఐదు చిత్రాలను సెట్ చేసుకుని 2016లో నిర్మాతగా తన సినీ ప్రస్థానం గురించి అభిషేక్ నామా వివరాలు వెల్లడించారు. అందులో కొన్ని వేరే వారి చేతుల్లోకి వెళ్ళిపోగా, మరికొన్ని ఇప్పటికీ కార్యరూపం దల్చలేదు. లక్కీగా కొన్ని సినిమాలు విడుదలై జనాదరణ పొందాయి. మరికొన్ని పరాజయం పాలయ్యాయి. నిజానికి బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వచ్చిన ‘జయ జానకీ నాయక’ మూవీని అభిషేక్ అగర్వాల్ నిర్మించాల్సింది. కానీ అనివార్యంగా అది మిర్యాల రవీందర్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది. దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ మూవీని నిర్మించారు. అదే వరుసలో నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంతో అభిషేక్ నామా ‘కేశవ’ మూవీ తీశాడు. ఇది ఫర్వాలేదనిపించింది. అదే రిజల్ట్ ను ఎక్స్ పెక్ట్ చేసి ఇప్పుడు రవితేజ- సుధీర్ వర్మ కాంబోలో అభిషేక్ నామా ‘రావణాసుర’ తీశారు కానీ ఇది బెడిసి కొట్టింది. ఇక ఈ మధ్యలో నవీన్ మేడారం దర్శకత్వంలో ‘హంటర్’ రీమేక్ గా ‘బాబు బాగా బిజీ’ని నిర్మించారు. బట్ దాన్ని తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. అడివి శేష్ హీరోగా అభిషేక్ నామా తీసిన ‘గూఢఛారి’ మాత్రం మంచి విజయాన్ని అందుకుని, నిర్మాతగా ఆయనకు, నిర్మాణ సంస్థకు చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇదిలా ఉంటే… ప్రస్తుతం అభిషేక్ నామా నిర్మిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. అందులో ప్రతిష్ఠాత్మకమైంది నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’. మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. దీన్ని ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నాడు. అలానే నవీన్ మేడారం షో రన్నర్ గా, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రధారిణిగా అభిషేక్ నామా ‘ఇడియట్స్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ వినోదాత్మక చిత్రంతో ఆదిత్య హాసన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు అభిషేక్ నామా ‘ప్రేమ విమానం’ అనే మరో సినిమా నిర్మిస్తున్నారు. సంతోష్ కాట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంగీత్ శోభన్, సాన్వే మేఘన జంటగా నటిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… అభిషేక్ నామా ఏడేళ్ళ నాటి కల గోపీచంద్ బయోపిక్! ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను అతని స్నేహితుడు సుధీర్ బాబుతో తీయాలన్నది అభిషేక్ నామా కోరిక. ఇటీవల ‘రావణాసుర’ ప్రమోషన్స్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే యేడాది ఏకంగా ఏడు సినిమాలను పట్టాలెక్కిస్తానని చెప్పారు. మరి ‘రావణాసుర’ దెబ్బకు అందులో ఏయే చిత్రాలు సెట్స్ పైకి వస్తాయి? అందులో గోపీచంద్ బయోపిక్ ఉంటుందా? ఉండదా? అనేది తెలియాల్సి ఉంది.