Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే అమీర్ ఖాన్.. ఎందుకో ఈ నడుమ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన చేస్తున్న కామెంట్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘నా మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా కుంగిపోయాను. ఎందుకంటే ఆమెను నేను ఎంతో ప్రేమించాను. మేమిద్దరం చాలా అన్యోన్యంగా జీవించాం. కానీ అనుకోని కారణాల వల్ల విడిపోయాం. అప్పుడు చాలా బాధపడ్డాను. మూడేళ్ల పాటు మామూలు మనిషిలా ఉండలేకపోయాను’ అంటూ తెలిపాడు.
read also : America: కసాయి తల్లి.. కొడుకు గొంతు కోసి చంపిన భారత సంతతికి చెందిన మహిళ
అంతే కాకుండా ఆమెను మర్చిపోయేందుకు మద్యానికి బానిస అయ్యానని.. సినిమాలపై దృష్టి పెట్టలేకపోయానంటూ చెప్పుకొచ్చాడు. ‘నాకు అంతకుముందు అసలు మద్యం అలవాటు లేదు. కానీ ఆమెను మర్చిపోవడానికి ప్రశాంతంగా పడుకోవడానికి మద్యం అలవాటు చేసుకున్నాను. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. ఆ బాధ నిజంగా నరకం లాంటిదే’ అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రీనాదత్త, అమీర్ ఖాన్ 1986లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2002లో విడిపోయారు. వీరిద్దరికీ ఓ కూతురు, కొడుకు ఉన్నారు. ఆ తర్వాత అమీర్ కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా విడిపోయారు.