హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే ఛాన్స్ దొరికితే విలన్ గా తన సత్తా చాటుతున్నాడు ఆది పినిశెట్టి. అంతేకాదు… ఇతర హీరోల చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడానికీ వెనకాడటం లేదు. అలా ‘రంగస్థలం’, ‘నిన్ను కోరి’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలలో నటించాడు. అయితే ‘సరైనోడు’లో ముఖ్యమంత్రి తనయుడు వైరం ధనుష్ గా ఆది పినిశెట్టి పోషించిన పాత్రను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందుకే ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు తాను ఉస్తాద్ రామ్ తో తీస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ‘ది వారియర్’లో ప్రతినాయకుడి పాత్రకు ఆదిని ఎంపిక చేశారు. అందులో ఆది పోషిస్తున్న ‘గురు’ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. దీనిని చూస్తే… రాక్షసత్వానికి ప్రతీకగా ఆది కనిపిస్తున్నాడు. క్యారెక్టర్ కోసం లుక్, స్టయిలింగ్ ను ఆది బాగానే మార్చాడు. ప్రేక్షకులను ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ‘సరైనోడు’ తర్వాత ఆది పినిశెట్టికి ప్రతినాయక పాత్రలు చాలా వచ్చినప్పటికీ ‘నో’ చెప్పిన అతను గురు పాత్రకు వెంటనే యస్ చెప్పడం విశేషమే.
ఆది పాత్ర గురించి లింగుస్వామి మాట్లాడుతూ “సినిమాలో గురు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి అందరినీ ఆకట్టుకుంటారు. రామ్, ఆది మధ్య సన్నివేశాలు నువ్వా – నేనా అన్నట్టు ఉంటాయి” అని అన్నారు. ‘ది వారియర్’ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఆరవ చిత్రంగా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆయన సినిమా గురించి, ఆది పాత్ర గురించి వివరిస్తూ, ”ఆది పోస్టర్ విడుదలైన కొన్ని క్షణాల్లో లుక్ వైరల్ అయ్యింది. రెస్పాన్స్ బాగుంది. గురు పాత్రకు ఆది పినిశెట్టి నూరు శాతం యాప్ట్. ఈ క్యారెక్టర్ సమ్‌థింగ్ స్పెషల్ అనేలా, ప్రేక్షకులు అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది. ‘సరైనోడు’లో ఆయన చేసిన పాత్ర కంటే పదింతలు పవర్‌ఫుల్‌గా గురు పాత్ర ఉంటుంది. రామ్ – ఆది మధ్య సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయిక. ఆర్జే విజిల్ మహాలక్ష్మి పాత్రలో ఆమె నటిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె లుక్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. ఇందులో అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.
