A.M.Ratnam:’ఇంతింతై వటుడింతై…’ అన్న చందాన అలాగ వచ్చి, ఇలాగ మెప్పించి ఎంతో ఎత్తుకు ఎదిగినవారు చిత్రసీమలో పలువురు ఉన్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ నిర్మాత ఏ.యమ్.రత్నం. ఆయన నిర్మించిన చిత్రాలు, అనువదించిన సినిమాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. రత్నం బ్యానర్ ‘సూర్యామూవీస్’ కూడా జనం మదిలో నిలచిపోయింది. ఈ పతాకంపై తెరకెక్కిన అనేక చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తెలుగువారయిన ఏ.యమ్.రత్నం తమిళనాట కూడా నిర్మాతగా తనదైన బాణీ పలికించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఏ.యమ్.రత్నం ‘హరిహర వీరమల్లు’ అనే భారీ జానపద చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అరణి మునిరత్నం 1954 ఫిబ్రవరి 4న నెల్లూరు బుచ్చిరెడ్డి పాలెంలో జన్మించారు. బాల్యం నుంచీ సినిమాలంటే ఆసక్తి ఉంది. కానీ, ఎలా సినిమా రంగంలో అడుగు పెట్టాలో తెలియదు. ఆ సమయంలో మిత్రుల సూచన మేరకు మద్రాసు చేరారు రత్నం. అక్కడ కొందరు ప్రముఖ మేకప్ మెన్ వద్ద పనిచేశారు. ప్రముఖ నటి విజయలలిత అక్క కూతురు విజయశాంతిని నటిగా రాణింప చేయాలని భావిస్తున్న సమయమది. ఆమెకు మేకప్ చేసేందుకు కుదిరారు రత్నం. విజయశాంతి తొలి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’లోనే కృష్ణ సరసన నాయికగా నటించారు. ఆ తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ సాగారు. అప్పట్లో ఆమెను హీరోయిన్ గా నటింప చేయడానికి రత్నం బాగా కృషి చేశారు. విజయశాంతి పర్సనల్ మేకప్ మేన్ గా సాగుతున్న రత్నం నిర్మాతలందరితోనూ ఎంతో సఖ్యంగా ఉండేవారు. ఆ రోజుల్లో నిర్మాతల సాధకబాధకాల్లో టెక్నీషియన్స్ కూడా పాలు పంచుకొనేవారు. అలా చిత్ర నిర్మాణంలోనూ మెలకువలు నేర్చారు రత్నం. ఆయన నిర్మాతగా మారడానికి విజయశాంతి కూడా సహకరించారు. తొలి ప్రయత్నంలో రాజశేఖర్ హీరోగా ‘ధర్మయుద్ధం’ అనే చిత్రాన్ని నిర్మించారు. తరువాత తమ సూర్యామూవీస్ పతాకంపై విజయశాంతితో ‘కర్తవ్యం’ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్ గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘కర్తవ్యం’ అనూహ్య విజయం సాధించింది. విజయశాంతిని జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిపింది. “పెద్దరికం, సంకల్పం” వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారాయన. వీటిలో ‘పెద్దరికం’ మంచి విజయం సాధించి, జగపతిబాబు హీరోగా నిలదొక్కుకొనేలా చేసింది.
శంకర్ తమిళంలో రూపొందించిన “జెంటిల్ మేన్, ప్రేమికుడు” వంటి చిత్రాలను తెలుగులో అనువదించి విజయాలు సాధించారు రత్నం. ఆ పై శంకర్ దర్శకత్వంలోనే కమల్ హాసన్ తో ‘ఇండియన్’ నిర్మించారు రత్నం. ఈ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా విడుదలై విజయఢంకా మోగించింది. ఆ తరువాత నుంచీ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సినిమాలు తీస్తూ విజయపథంలో పయనించారు రత్నం. తెలుగులో ఆయన నిర్మించిన “స్నేహం కోసం, ఖుషి, నాగ, నీ మనసు నాకు తెలుసు, బంగారం, ఆక్సిజన్” సినిమాలు ఉన్నాయి. వీటిలో పవన్ కళ్యాణ్ తో తీసిన ‘ఖుషి’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకొని బంపర్ హిట్ చూసింది. అలాగే రత్నం అనువదించిన “అరుణాచలం, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్” చిత్రాలు సైతం అలరించాయి.
రత్నం తనయుల్లో పెద్దవాడైన జ్యోతికృష్ణ ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో దర్శకుడయ్యారు. ఇక చిన్న కొడుకు రవికృష్ణ నటించిన ‘7జి బృందావన్ కాలనీ’ యువతను భలేగా ఆకర్షించింది. తరువాత తమిళ చిత్రాలలోనే రవికృష్ణ హీరోగా నటించారు. ఏ.యమ్.రత్నం నిర్మాతగా ఓ సినిమా వస్తోందంటే , అందులో కథానుగుణంగా భారీతనం చోటు చేసుకుంటుందని ప్రేక్షకుల విశ్వాసం. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కిస్తున్నారు రత్నం. ఈ సినిమాతో రత్నం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.