భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కావడంతో నిదానంగా జనాలు థియేటర్లకు రావడం మొదలైంది. కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం పూర్తిస్థాయిలో జరగకపోయినా… స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ చిత్రాలను వారానికి మూడు నాలుగు చొప్పున రిలీజ్ అవుతున్నాయి. చిత్రం ఏమంటే… ఈ నెల మొదటి వారాంతంలో స్ట్రయిట్ తెలుగు సినిమా ‘మేజర్’తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ‘విక్రమ్’, మలయాళ డబ్బింగ్ మూవీ ‘మయూరాక్షి’, హిందీ డబ్బింగ్ సినిమా ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ వచ్చాయి. అలానే వచ్చే శుక్రవారం ‘అంటే సుందరానికీ…’ మూవీతో పాటు ‘సురాపానం, జరిగిన కథ’ చిత్రాలు… అలానే డబ్బింగ్ సినిమాలు ‘777 చార్లి, జురాసిక్ వరల్డ్ డొమీనియన్’ విడుదల కానున్నాయి. అలానే 19వ తేదీ సత్యదేవ్ ‘గాడ్సేతో పాటు రానా ‘విరాట పర్వం’, కన్నడ డబ్బింగ్ మూవీ ‘కే3’ జనం ముందుకు రానున్నాయి. ఇదంతా ఒక ఎత్తుగానే జూన్ లాస్ట్ వీకెండ్ లో విడుదలవుతున్న చిత్రాలు ఒక ఎత్తు!
ఏకంగా తొమ్మిది చిత్రాలు!
జూన్ 23న కొండా మురళి, సురేఖ బయోపిక్ ‘కొండా’ను రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేయబోతున్నారు. త్రిగుణ్ ఇందులో కొండా పాత్రను పోషించాడు. ఇక 24వ తేదీ కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’తో పాటు సుమంత్ అశ్విన్ ‘7 డేస్ 6 నైట్స్’, సాయిరామ్ శంకర్ ‘ఒక పథకం ప్రకారం’, లక్ష్య ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’, శ్రీరామ్ ‘టెన్త్ క్లాస్ డైరీస్’, తేజ్ కూరపాటి ‘హుషారు’, ప్రతీక్ ప్రేమ్ కరణ్ ‘సదా నన్ను నడిపే’, ‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.