టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు నిర్మాతగా పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన రాజు ప్రస్తుతం డైరెక్టర్ గా మారారు. ఇక ఈ మధ్య డర్టీ హరి పేరుతో ఒక రొమాంటిక్ సినిమా తీసి విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో రొమాంటిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. సుమంత్ అశ్విన్ ,మెహర్ చాహల్, రోహన్, క్రితికా శెట్టి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమాను మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా డైరెక్టర్.. అడల్ట్ కంటెంట్ తోనే వచ్చేసాడు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోయే రోహన్, సుమంత్ ఇద్దరు కలిసి బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేయడానికి రోడ్ ట్రిప్ కి వెళ్తారు. మధ్యలో వారికి ఇద్దరు అమ్మాయిలు పరిచయమవుతారు. రోహన్ తన పెళ్లి గురించి చెప్పకుండా తనకు పరిచయమైన అమ్మాయితో అన్ని కానిచ్చేస్తాడు. ఇక డైరెక్టర్ కావడానికి కథను రాసుకుంటున్న సుమంత్ తనకు పరిచయమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. మధ్యలో వీరి గొడవలు, విడిపోవడాలు జరగడం చూపించారు. చివరికి ఈ రెండు జంటల మధ్య ఏం జరిగింది..? అనేది సినిమాగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ మొత్తాన్ని రొమాన్స్ తో హీరోయిన్ల అందచందాలతో నింపేశారు. ఈ సినిమాతో మెగా మేకర్ ఎంఎస్ రాజు పదహారేళ్ల కుర్రాడు సమర్థ్ ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ కుర్రాడు కూడా సినిమాకు మంచి మ్యూజిక్ నే అందించాడు. మొత్తానికి ట్రైలర్ ని బట్టి మరో డర్టీ హరిని చూపించారు డైరెక్టర్ ఎంఎస్ రాజు . మరి ఆ సినిమాల ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.