నిర్మాత ఎంఎస్ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్ రాజు తన తదుపరి చిత్రాన్ని ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. నటుడుగాను యాక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన మెహర్ చావల్ అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈ నలుగురే కాకుండా సుష్మ, రిషికా బాలి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో చక్కని నటన కనబరిచిన గోపరాజు రమణ అతిథిపాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యంత వేగంగా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.