ఏప్రిల్ 20న ‘ఉమ్మడి కుటుంబం’కు 55 ఏళ్ళు మహానటుడు నటరత్న యన్.టి.రామారావు బహుముఖ ప్రజ్ఞ గురించి తెలియని తెలుగువారు ఉండరు. కేవలం నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకునిగా, కథకునిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, ఎడిటర్ గా యన్టీఆర్ సాగిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు. ఆయన కథలతో రూపొందిన పలు చిత్రాలు తెలుగు వారిని విశేషంగా అలరించాయి. యన్టీఆర్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం సైతం విజయపథంలో పయనించి, అందరినీ అలరించింది. రామకృష్ణ-ఎన్.ఏ.టి. కంబైన్ పతాకంపై డి.యోగానంద్ దర్శకత్వంలో యన్టీఆర్, ఆయన సోదరుడు యన్.త్రివిక్రమరావు ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రాన్ని నిర్మించారు. 1967 ఏప్రిల్ 20న విడుదలైన ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం ఘనవిజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది.
‘ఉమ్మడి కుటుంబం’ కథ విషయానికి వస్తే – టైటిల్ ను బట్టే ఈ చిత్రకథ ఏమిటో కాసింత ఊహించవచ్చు. ఓ ముసలి తల్లికి నలుగురు కొడుకులు. పెద్దవాడు నాగయ్య ఓ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుంటాడు. ఆయన భార్య గౌరి గయ్యాళి. వారికి ఓ కొడుకు. రెండో కొడుకు చంద్రం పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. అతని భార్య కాంతం నిత్యం సంబరాలపై మనసు పారేసుకొంటూ ఉంటుంది. మూడోకొడుకు ముకుందం డాక్టర్. పట్నంలో ప్రాక్టీస్. అతని భార్య రమ పేరుకు తగ్గట్టే లక్ష్మీకళ కలిగిన ఇల్లాలు. ఆమె అత్త దగ్గరే పల్లెలో ఉంటుంది. ఇక నాలుగో అబ్బాయి రాము. చదువు రాకపోయినా, తనవల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగరాదనే మంచి మనసు కలవాడు. అయితే అతనికి నాటకాల పిచ్చి. దాంతో తరచూ చీవాట్లు తింటూ ఉంటాడు. నాగయ్య కొడుక్కి రాము అంటే ఎంతో అభిమానం. డాక్టర్ ముకుందం, తన పల్లెటూరి భార్యపై విరక్తి పెంచుకొని పట్నంలో ఓ టక్కులాడి మోజులో పడతాడు. దాంతో ఇంటిముఖమే చూడడు. అందువల్ల రమను ఊళ్ళో వారితో కలసి గౌరి కూడా నానా మాటలూ అంటూ ఉంటుంది. ఇక చంద్రం, తన భార్య పోరు పడలేక, ఆమె పుట్టింటికే వెళతాడు. అక్కడ పలు అవమానాలు పడతాడు. ఛిన్నాభిన్నమైన కుటుంబాన్ని చూసి ముసలి తల్లి తల్లడిల్లి పోతుంది. ఆమె బాధ చూడలేక రాము పట్నం బయలు దేరుతాడు. దారిలో అతనికి శారద అనే ధనవంతురాలు పరిచయం అవుతుంది. ఆమె కారు చెడిపోతే, ఇంటిదాకా తోసుకుంటూ వెళతాడు రాము. శారద తండ్రి జమీందార్. అతనికి రాము మంచితనం నచ్చుతుంది. శారద సైతం రాముని ప్రేమిస్తుంది. రాము వచ్చిన పని తెలుసుకున్న జమీందార్ ఓ ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగా రాము టిప్పుటాపుగా తయారై తన అన్న ముకుందాన్ని బుట్టలో వేసుకున్న టక్కులాడితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతాడు. దాంతో ముకుందానికి ఆ వన్నెలాడి అసలు రంగు తెలిసి, భార్యను వెదుక్కుంటూ ఊరికి వెళతాడు. అదే సమయంలో భార్య దొంగతనాన్ని పట్టుకొని తగిన బుద్ధి చెబుతాడు నాగయ్య. ఇక పెళ్ళాం బెల్లమని వెళ్లిన చంద్రం అక్కడ అవమానాలు తాళలేక ఇంటిముఖం పడతాడు. తమ్ముడు బుద్ధి చెప్పగా చంద్రం భార్య కాంతం కూడా మెట్టినిల్లు చేరుకుంటుంది. తోడికోడళ్ళ మాటలు తట్టుకోలేక చనిపోవాలనుకున్న రమతో పాటే ఆమె అత్త కొడుకును నిలదీయాలని బయలు దేరుతుంది. వారు రాముకు తారసపడతారు. అందరూ గ్రామంలోని ఇల్లు చేరతారు. అక్కడ నాగయ్య కొడుకు బాబాయ్ రాముపై బెంగతో మంచం పట్టి ఉంటాడు. రామును చూశాక ఆ బాబు కోలుకోవడం, అన్నదమ్ములు మళ్ళీ కలుసుకోవడం, విడిపోయినప్పుడు కట్టుకున్న అడ్డు తొలగించుకోవడం అన్నీ జరిగి కథ సుఖాంతమవుతుంది.
ఇందులో పెద్దకొడుకుగా రేలంగి ఆయన భార్యగా సూర్యకాంతం, రెండో కొడుకు చంద్రంగా సత్యనారాయణ, ఆయన పెళ్ళాంగా ఎస్.వరలక్ష్మి, మూడో కొడుకు డాక్టర్ ముకుందంగా ప్రభాకర్ రెడ్డి, అతని అర్ధాంగిగా సావిత్రి, నాలుగో అబ్బాయి రాముగా యన్టీఆర్- ఆయన జోడీగా కృష్ణకుమారి నటించారు. మిగిలిన పాత్రల్లో హేమలత, నాగభూషణం, ముక్కామల, ఎల్.విజయలక్ష్మి, వాణిశ్రీ, రాజబాబు, అల్లు రామలింగయ్య, నాగరాజు, ఛాయాదేవి, పొట్టిప్రసాద్, బాలకృష్ణ (అంజి) నటించారు.
ఈ చిత్రానికి సముద్రాల జూనియర్ రచన చేయగా, పాటలను సి.నారాయణ రెడ్డి, కొసరాజు, సముద్రాల జూనియర్ రాశారు. ఈ చిత్రానికి టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. రవికాంత్ నగాయిచ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఇందులోని “కుటుంబం ఉమ్మడి కుటుంబం…” , “చెప్పాలని ఉంది…”, “చదివినోడికన్నా…”, “తస్సాదియ్యా తస్సాదియ్యా…”, “జిగి జిగి జిగేలు మన్నది…”, “భలే మోజుగా తయారైన..”, “హలో హలో…”, “చేతికి చిక్కావే పిట్టా…” వంటి పాటలు అలరించాయి. ఇక ఇందులో ‘సతీ సావిత్రి’ నాటకం సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలచింది. సినిమా ప్రారంభంలోనే ఈ నాటకం ఉంటుంది. ఇందులో యన్టీఆర్ యమునిగా, సతీసావిత్రి వాణిశ్రీ, సత్యవంతునిగా రాజబాబు కనిపిస్తారు. “పో పో పోవేల పొమ్మికన్…” అంటూ సాగే పాట భలేగా ఆకట్టుకుంది. 11 సంవత్సరాల అనంతరం 1978లో నిజంగానే యన్టీఆర్ యమునిగా, వాణిశ్రీ సావిత్రిగా ‘సతీసావిత్రి’ని రంగుల్లో నిర్మించారు ‘లవకుశ’ చిత్ర నిర్మాత శంకర్ రెడ్డి. “హలో హలో… మైడియర్ హలో…”, “చేతికి చిక్కావే పిట్టా…” పాటల్లో యన్టీఆర్, ఎల్.విజయలక్ష్మి డాన్స్ అప్పట్లో జనాలను చిందులు వేయించాయి.
‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం అప్పట్లో 17 పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. కొన్ని కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. విజయవాడ దుర్గా కళామందిర్ల్ లో ఏకధాటిగా 197 రోజులు ప్రదర్శితమయింది. 1968లో జరిగిన మాస్కో చిత్రోత్సవంలో ‘ఉమ్మడి కుటుంబం’ ప్రదర్శితమయింది.