దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన అనేక చిత్రాలలో స్త్రీల సమస్యలను చర్చిస్తూ వాటికి తగిన పరిష్కారాలు చూపించారు. తమిళంలో అదే తీరున కె.బాలచందర్ సాగారు. బాలచందర్ రూపొందించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు-పడమర’గా రీమేక్ చేశారు. ఈ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రంతో శ్రీవిద్య, నరసింహరాజుకు మంచి పేరు లభించింది. ఆ సినిమా విడుదలైన ఆరు నెలలకు దాసరి తన సొంత కథతో రూపొందించిన చిత్రం ‘కన్య-కుమారి’. ఇందులో కన్యగా జయమాలిని, కుమారిగా శ్రీవిద్య నటించారు. కీలక పాత్రను నరసింహరాజు పోషించారు. మరో ముఖ్యపాత్రలో దాసరి నారాయణ రావు కనిపించారు. 1977 మే 6న విడుదలైన ‘కన్య-కుమారి’ చిత్రంతోనే ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకునిగా పరిచయం కావడం విశేషం!
‘కన్య-కుమారి’లోని కథానాయకుని పాత్ర ప్లేబోయ్ లా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బాలచందర్ ‘అంతులేని కథ’లో ఫటాఫట్ జయలక్ష్మి ధరించిన పాత్రకు మేల్ వర్షన్ అనుకోవచ్చు. అతని ఆగమనంతో నిశ్చలమైన నదిలాంటి కన్య జీవితంలో కలిగింది సంచలనం… గలగలపారే సెలయేరు లాంటి కుమారి జీవితంలో నిలచింది గమనం… ఈ రెండు జీవితాల కథాసంకలనం ‘కన్య-కుమారి’ అని దాసరి సెలవిస్తూ ఈ సినిమాను రూపొందించారు. చివరకు వయసులో కాస్త పెద్దదైన కుమారి ‘కన్య’ జీవితానికి న్యాయం జరగాలని తాను తప్పుకుంటుంది. అంటే గలగల పారుతూ మరో నదిలో కలవడానికి వెళ్తుందన్నమాట! అంతే తప్ప సముద్రుణ్ణి చూసుకోదు.
శ్రీవిద్య, జయమాలిని, దాసరి నారాయణరావు, నరసింహరాజు, శరత్ బాబు, రమాప్రభ, నిర్మల, రమాదేవి, గోకిన రామారావు, నారాయణ మూర్తి నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం దాసరి సమకూర్చారు. ఈ చిత్రాన్ని జయ సరిగమ ఆర్ట్స్ పతాకంపై టి.కాశీ, పర్వతనేని నారాయణరావు నిర్మించారు. బాలు బాణీలకు సి.నారాయణ రెడ్డి, వేటూరి రాశారు. ఇందులోని “ఇది తొలిపాట…” అంటూ సాగే గీతాన్ని వేటూరి రాయగా, బాలు గానం చేస్తూ తొలిసారి రికార్డ్ చేశారు. ఇందులోని “చిలకల్లె నవ్వాలి…”, “నేను ఆ అన్నా…”, “శ్రీరస్తు శుభమస్తు….”, “రహస్యం తీయని రహస్యం…”, “తొలిసంధ్యకు తూరుపు ఎరుపు…” అంటూ మొదలయ్యే గీతాలూ ఆకట్టుకున్నాయి. ఇందులో దాసరి నారాయణరావు మతిమరపు ఉన్న పాత్రలో నవ్వులు పూయించడం విశేషం!