Simham Navvindi: నటరత్న యన్టీఆర్ తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టే నాటికే తన నటవారసునిగా బాలకృష్ణను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో, బాలకృష్ణ హీరోగా ‘సింహం నవ్వింది’ చిత్రాన్ని రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై నిర్మించారు. యన్టీఆర్ కు సన్నిహితుడైన దర్శకుడు డి.యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ సమర్పకునిగా, మూడో కొడుకు హరికృష్ణ నిర్మాతగా, నాలుగో అబ్బాయి మోహన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా, ఐదో కుమారుడు బాలకృష్ణ హీరోగా ‘సింహం నవ్వింది’రూపొందించారు రామారావు. యన్టీఆర్ తొలిసారి 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత రెండు నెలలలోపే ఈ చిత్రం జనం ముందు నిలచింది. 1983 మార్చి 3న విడుదలైన ‘సింహం నవ్వింది’ కామెడీ ప్రధానంగా రూపొందింది.
ఇంతకూ కథ ఏమిటంటే – నరసింహం ఇండస్ట్రియలిస్ట్. బ్రహ్మచారి. నియంతలా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన వద్ద అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే బాలకృష్ణ కష్టపడి పనిచేయడంతో బాస్ కు దగ్గరవుతాడు. బ్రహ్మచారి అయిన నరసింహం తన కంపెనీలో పనిచేసేవారు పెళ్ళి చేసుకోకూడదనీ నియమం అంటాడు. బాలకృష్ణ ప్రమోషన్ లిస్ట్ లో ఉంటాడు. అందువల్ల ప్రమోషన్ రాగానే తాను ప్రేమించిన రాధను పెళ్ళాడాలని భావిస్తాడు. కానీ, రాధ తండ్రి పానకాలు బలవంత పెట్టడంతో ఓ గుడిలో రాధ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు బాలకృష్ణ. ఆ తరువాత హనీమూన్ కు ఓ ట్రావెలర్స్ బంగళాకు వెళతారు కొత్త జంట. అక్కడికి పనిమీద వెళుతూ నరసింహం కూడా దిగుతాడు. అక్కడ నుంచీ బాలకృష్ణ, రాధకు కష్టాలు మొదలవుతాయి. ఒంటరిగా ఉన్నానని రాధ చెబుతుంది. ఆమెకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానంటాడు నరసింహం. ఆమె అన్న ఒక్క మాట నరసింహంను కలవర పెడుతుంది. అప్పుడు ఆమెకు తన గతాన్ని వివరిస్తాడు నరసింహం. ప్రేమలో మోసపోయిన కారణంగా తాను బ్రహ్మచారిగానే ఉండాల్సి వచ్చిందని చెబుతాడు. చివరకు నరసింహానికి బాలకృష్ణ, రాధ పెళ్ళి విషయం తెలుస్తుంది. అందువల్ల బాలకృష్ణకు అతను కోరుకున్న ప్రమోషన్ ఇస్తాడు, అయితే జీవితాంతం రాధకు అసిస్టెంట్ గానే ఉండాలనీ శిక్ష వేస్తాడు. అది విని బాలకృష్ణ కంగారు పడతాడు. అది చూసి సింహం లాంటి నరసింహం నవ్వుతాడు. కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కళారంజని నాయికగా నటించింది. అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, త్యాగరాజు, రాళ్ళపల్లి, కె.కె.శర్మ, అన్నపూర్ణ, మమత, కాకినాడ శ్యామల, శ్రీలక్ష్మి ఇతర ముఖ్యపాత్రధారులు. అతిథి పాత్రలో ప్రభ కనిపించారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాసిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం డి.యోగానంద్ అందించారు. సి.నారాయణ రెడ్డి, వేటూరి పాటలు రాయగా, చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులోని “ముంజలాంటి చిన్నదానా…”, “గువ్వా గువ్వా ఎక్కడికే…”, “హే భమ్ చిక భమ్…”, “జాబిలి వచ్చింది…”, “ఎలా ఎలా నీకుంది…”, “ఒక్కసారి నవ్వు…” అంటూ సాగే పాటలు అలరించాయి. యన్టీఆర్ పై చిత్రీకరించిన “ముంజలాంటి చిన్నదానా…” సాంగ్ ను వేటూరి రాయగా, ఎస్పీ బాలు ఆలపించారు. బాలకృష్ణ అన్ని పాటలను సినారె కలం పలికించగా, నందమూరి రాజా గానం చేశారు. అప్పటికే ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర చేసిన యన్టీఆర్ ఈ లైటర్ వెయిన్ మూవీలో నటించడం అభిమానులకు అంతగా రుచించలేదు. దాంతో ‘సింహం నవ్వింది’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. బాలకృష్ణకు నటునిగా మంచి మార్కులు సంపాదించి పెట్టిందీ సినిమా. చిత్రమేమిటంటే, ఇదే కథను తరువాత 1987లో శివాజీగణేశన్, కార్తిక్ తో తమిళంలో ‘రాజా మరియాదై’ పేరుతో రీమేక్ చేశారు.