తెలుగునాట తారలకు లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక మహానటులకు అయితే మరపురాని ప్రేక్షకాభిమానం లభిస్తుంది. ఓ వైపు నటనతో ఆకట్టుకుంటూనే మరోవైపు స్టార్స్ గా తెలుగునాట జైత్రయాత్ర చేసిన ఘనత యన్టీఆర్, ఏయన్నార్ దే! వారిద్దరూ బాక్సాఫీసు వద్ద ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారు. అలాంటి ఈ ఇద్దరు ఏకంగా 14 చిత్రాలలో కలసి నటించారు. సూపర్ స్టార్ డమ్ చూసిన ఇద్దరు మహానటులు అన్ని చిత్రాలలో కలసి నటించింది ప్రపంచంలో మరెక్కడా కానరాదు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950). వారిద్దరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘సత్యం-శివం’. 1981 మే 28న నటరత్న యన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదలయింది. ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది.
‘సుహాగ్’ ఆధారం…
‘సత్యం-శివం’ చిత్రం హిందీ సినిమా ‘సుహాగ్’ ఆధారంగా రూపొందింది. ఇందులో మరికొన్ని హిందీ చిత్రాల్లోని సన్నివేశాలను సందర్భానుసారంగా జోడించడం విశేషం. నేరచరిత గల నాగరాజు అనేవాడు భార్య, ఇద్దరు కొడుకులను వదిలేసి మరో అమ్మాయిని చేరదీస్తాడు. ఆ తల్లి తన ఇద్దరు కొడుకులతో జీవనం సాగించాలని అనుకుంటుంది. ఓ దొంగ ఆ ఇద్దరు బిడ్డల్లో ఒకరిని ఎత్తుకు వెళ్ళి, రౌడీగా పెంచుతాడు. అతనే శివం. తల్లిదగ్గర పెరిగి పెద్దయి ఇన్ స్పెక్టర్ అయినవాడు సత్యం. నాగరాజు దుర్మార్గానికి బలైపోయిన మరో స్త్రీ తన కూతురును కూడా అతని మొదటి భార్య దగ్గరకే చేర్చి కన్నుమూస్తుంది. ఆ ఆడబిడ్డను కూడా కన్నకూతురులా పెంచుతుంది ఆ మహాతల్లి. విధి ఈ ముగ్గురు తోబుట్టువులను ఏదో రూపంలో కలుపుతూ ఉంటుంది. సత్యం చెల్లెలిని శివం కూడా సొంత చెల్లిగా భావిస్తాడు. ఆమె ప్రేమించిన వాణ్ణి కాపాడబోయిన శివం, సత్యంకు విరోధి అవుతాడు. నాగరాజుకు వీళ్ళిద్దరూ తన కొడుకులు అన్న విషయం తెలియదు. అతని కారణంగానే సత్యం చూపు పోగొట్టుకుంటాడు. మళ్ళీ సత్యం, శివం దగ్గరవుతారు. సత్యం చూపు పోవడానికి కారకుడైన నాగరాజును తెలివిగా బురిడీ కొట్టించి, చట్టానికి పట్టిస్తారు. తాను చెడ్డవాడయినా, తనయులు మంచివాళ్ళని నాగరాజు తెలుసుకుంటాడు. తన కళ్ళను సత్యంకు దానం చేసి నాగరాజు జైలుకు పోవడంతో కథ ముగుస్తుంది.
మోత మోగించిన పాటలు…
ఈ కథను కె.రాఘవేంద్రరావు తనదైన శైలిలో తెరకెక్కించారు. అందులోనూ శ్రీదేవి, రతి అగ్నిహోత్రి వంటి అందగత్తెలు ఉండడంతో కనువిందుగా పాటలు చిత్రీకరించారు. చక్రవర్తి బాణీల్లో వేటూరి సాహిత్యం భలేగా సాగింది. ఇందులోని “మోతగున్నావ్ పిల్లో…నా రాత ఎట్టాగుందో…” , “అందమే అందమా…”, “జంబలగిరి పంబ కాడ…”, “మంచి తరుణం మించి పోనీకు…”, “వెలుగునీడల్లో వెలుగనీ బంధం…” పాటలు ఆకట్టుకున్నాయి. సత్యానంద్ రచన కూడా అలరించింది. సత్యనారాయణ, పుష్పలత, మోహన్ బాబు, భానుచందర్, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, చలపతిరావు, పి.జె.శర్మ తదితరులు నటించారు.
అభిమానుల రచ్చ…
‘సత్యం-శివం’ సినిమా వచ్చే సమయానికి యన్టీఆర్, ఏయన్నార్ అభిమానుల మధ్య తీవ్రమైన పోటీ సాగుతోంది. ఎందువల్ల నంటే, ఆ యేడాది ఏయన్నార్ నటించిన ‘ప్రేమాభిషేకం’ ఘనవిజయం సాధించింది. ఆ సినిమా పలు కేంద్రాలలో విజయవిహారం చేయడం చూసి, అక్కినేని అభిమానులు రెచ్చిపోయారు. అయితే అప్పటికే యన్టీఆర్ కు అనేక సూపర్ హిట్స్ ఉన్న కారణంగా, ఏయన్నార్ ఫ్యాన్స్ కు పోటీగా రామారావు అభిమానులు కరపత్రాలు వెలువరించి రచ్చ చేయసాగారు. అలాంటి తరుణంలో వచ్చిన ‘సత్యం-శివం’ చిత్రంలో యన్టీఆర్ దే పైచేయిగా సాగింది. ఈ చిత్రానికి యన్టీఆర్ రెండో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మాత. టైటిల్స్ లో డి.వెంకటేశ్వర్లు అని పడుతుంది. దాంతో యన్టీఆర్ పేరు సమర్పకునిగా ముందే టైటిల్స్ లో కనిపిస్తుంది. ఇక రామారావు రెగ్యులర్ మాస్ డైలాగ్స్, మారు వేషాలు కూడా ఇందులో అలరించాయి.
భలే విశేషం…
ఏయన్నార్ మ్యారేజ్ డే ఫిబ్రవరి 18న విడుదలైన ‘ప్రేమాభిషేకం’ సరిగా యన్టీఆర్ బర్త్ డే అయిన మే 28న వంద రోజులు పూర్తి చేసుకుంది. ఆ సినిమా 30 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. అంతకు ముందే యన్టీఆర్ ‘అడవిరాముడు’ 32 కేంద్రాలలో వందరోజులు చూసింది. అందువల్ల అంత చేసి, ఇంత చేసి ‘ముప్పై’ కేంద్రాలే అంటూ యన్టీఆర్ ఫ్యాన్స్ ఎద్దేవా చేశారు. ఇలా ఫ్యాన్స్ పోటీతో ‘సత్యం-శివం’ భలేగా ఆకట్టుకుంది. ఈ సినిమా తొలివారం యాభై లక్షలకు పైగా వసూలు చేసి, ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాలుగు వారాల వరకూ బాగానే అలరించిన ‘సత్యం-శివం’ తరువాత ఆ ఊపును కొనసాగించలేక పోయింది. విజయవాడలో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూసింది. ఏది ఏమైనా యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన చివరి చిత్రంగా ‘సత్యం-శివం’ నిలచిపోయింది.
(మే 28తో ‘సత్యం-శివం’కు నలభై ఏళ్ళు)