కరోనా టైమ్ లో ఖాళీగా ఇంట్లో కూర్చున్నవాళ్ళను విశేషంగా ఆకట్టుకుంది గర్ల్ ఫార్ములా సీరిస్ లో చాయ్ బిస్కెట్ సంస్థ నిర్మించిన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్. తొలి సీజన్ ఎపిసోడ్స్ అన్నింటినీ కలిపి ఒకటిగా యూ ట్యూబ్ లో టెలికాస్ట్ చేసిందీ సంస్థ. పదేళ్ళ గ్యాప్ ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి సంసారం జీవితంలోకి అడుగుపెట్టిన తరుణంలో వారి మనోభావాలు ఎలా ఉంటాయనే అంశాన్ని తీసుకుని దర్శకుడు పృథ్వీ వనం ఆ వెబ్ సీరిస్ ను తీశాడు. దాంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఈ యేడాది ఫిబ్రవరి 14న సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. ప్రతి ఆదివారం ఒక్కో ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తూ, ఈ వారంతో ఈ సీజన్ కు ముగింపు పలికారు.
ఆల్ ఈజ్ వెల్! పాపం పృథ్వీ!!
గత వారం ఎపిసోడ్ లో సింగపూర్ ఉద్యోగం గురించి మేఘనకు చెప్పి భంగపడతాడు పృథ్వీ. కారులో కీచులాడుకున్న ఈ ఇద్దరూ ముభావంగా అత్తగారి ఇంటిలోకి సంక్రాంతి పండగ సందర్భంగా అడుగుపెడతారు. దాంతో ఏడో ఎపిసోడ్ ముగిసింది. ఇంటి కొచ్చిన దగ్గర నుండి పృథ్వీ అన్ ఈజీగా ఉండటం అత్తమామలు గమనిస్తారు. దానికి కారణంగా మేఘనానేమో అనే సందేహమూ వాళ్ళ కొస్తుంది. మేఘన కొత్త ఉద్యోగం గురించి, అందులో భాగస్వామి అయిన హీరో విజయ్ దేవరకొండ గురించి తల్లి ఆరా అడిగితే చికాకు పడుతుంది మేఘన. ఆమె జెస్సీతోనూ; పృథ్వీ కార్తీక్ తోనూ తమ మధ్య జరిగిన గొడవ గురించి ఫోన్ లో చెబుతారు. తప్పు నీది కానప్పుడు పృథ్వీని నిలదీయమని, అలా వదిలేయవద్దని, ‘కమ్యూనికేషన్ ఈజ్ ద కీ’ అని జెస్సీ సలహా ఇస్తుంది. మేఘనను బాధపెట్టడం కరెక్ట్ కాదని, తప్పు నీదైనప్పుడు వెంటనే సారీ చెప్పమని అటు పృథ్వీకి కార్తీక్ సలహా ఇస్తాడు. మొత్తానికి భోగి రోజు ఉదయం ఇద్దరూ ఓపెనప్ అవుతారు. కారులో తాను అంత దారుణంగా ఎలా ప్రవర్తించాడో తనకే తెలియడం లేదని పృథ్వీ సారీ చెబుతాడు. మేఘన పట్ల తనకు ప్రేమకంటే అబ్సెషన్, పొసెసివ్ నెస్, ఇన్ సెక్యూర్డ్ ఫీలింగ్ ఉందేమోననే అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రతి విషయాన్ని గురించి అతిగా ఆలోచించే పృథ్వీ ‘మనం మ్యారేజ్ బ్రేక్ చేసుకుందామా? నేను నీకు తగ్గ వ్యక్తిని కాదేమో?’ అనే సందేహం వ్యక్తం చేస్తాడు. దాంతో అతని చెంప చెళ్ళుమనిపిస్తుంది మేఘన. ఆ ఒక్క దెబ్బతోనే ఆమెకు తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకుంటాడు పృథ్వీ. ఎవరూ జీవితంలో పర్ ఫెక్ట్ కాదని, దానిని సాధించడమే బెటర్ లైఫ్‌కు దారి తీస్తుందని చెబుతుంది మేఘన. సింగపూర్ జాబ్ ను వదిలేసుకున్న పృథ్వీకి హైదరాబాద్ లోనే బెటర్ ఆఫర్ వస్తుంది. సంక్రాంతి పండగను గ్రాండ్ గా జరుపుకుని ఈ జంట హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. తన అతి ప్రవర్తనకు తండ్రికి సారీ చెబుతుంది మేఘన. కానీ చిత్రంగా తల్లికి మాత్రం చెప్పదు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో తప్పు అంతా పృథ్వీదే అన్నట్టుగానూ, మేఘనకు ఉంది మెచ్యూరిటీ తప్పితే యాటిట్యూట్ కాదన్నట్టుగానూ చూపించారు. నిజానికి ఆమె కూడా ఉద్యోగంలో చేరిన తర్వాత పృథ్వీని అవాయిడ్ చేసినట్టుగానూ, అతన్ని పట్టించుకోనట్టుగానూ గత ఎపిసోడ్స్ లో కొన్ని చోట్ల చూపించారు. సో…. ఆమెలోనూ ఓ మార్పు వచ్చినట్టు కనీసం ఒకటి రెండు సీన్స్ అయినా తీసి ఉండాల్సింది. ‘ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు… నాతో సహా’ అనే ఒకే ఒక్క మాట మేఘనతో చెప్పించి, ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేశాడు దర్శకుడు. మొత్తం మీద పృథ్వీకంటే పదేళ్ళు చిన్నదైనా మేఘనలోనే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ అనేది తేల్చి చెప్పేశాడు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ అంతా వన్ సైడ్ గా సాగింది. చివరకు మగాడు (మొగుడు) దిగివస్తే… ‘ఆల్ ఈజ్ వెల్’ అని స్పష్టం చేశారు. ఆ రకంగా ‘దాంపత్యం రసమయం మధురామృతం’ అనే ఎపిసోడ్ కు శుభం కార్డు పడిపోయింది.
మొదటి సీజన్ తో పోల్చితే సెకండ్ సీజన్ లో రొమాన్స్ కాస్తంత తక్కువే. అయితే పెళ్ళి తర్వాత జరిగే కథ కావడంతో వాళ్ళు ఇండివిడ్యువల్ గా లైఫ్ లో ఎదగడం కోసం ఎలాంటి స్ట్రగుల్ అయ్యారనే దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అంతగా ఫన్ క్రియేట్ చేయలేకపోయారు. లాస్ట్ వీక్ ఎపిసోడ్ తో పోల్చితే, ఈ లాస్ట్ ఎపిసోడ్ అన్ని రకాలుగా బాగుంది. నేపథ్య సంగీతం, మాటలు, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ వీటన్నింటిలో తమ బెస్ట్ ను ఇచ్చారు. అలానే ఎపిసోడ్ చివరిలో చైతన్యరావు నటన బాగుంది. అతనితో పోల్చితే అనన్య శర్మ నటన కొంత తెలిపోయింది. విశేషం ఏమంటే… ఇటు చైతన్య రావ్, అటు అనన్య శర్మ ఇద్దరూ ఈ వెబ్ సీరిస్ పుణ్యమా సినిమా దర్శకనిర్మాతల దృష్టిలో పడ్డారు. ఇద్దరికీ ఇప్పుడు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఈ వెబ్ సీరిస్ మూడో సీజన్ మొదలయ్యే లోపు వీరిద్దరినీ విడివిడిగా మనం కనీసం రెండు మూడు సినిమాల్లో చూసేయొచ్చు. అలానే మరో సీరిస్ ను తీసినా చూడటానికి వ్యూవర్స్ సిద్ధం అన్నట్టుగానే కూల్ గా ఈ సీజన్ ను ముగించారు ప్రొడ్యూసర్స్ అనురాగ్ అండ్ శరత్!