ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా మొదలైన ’30 వెడ్స్ 21′ సీజన్ 2 నాన్ స్టాప్ గా సాగిపోతోంది. ప్రతి ఎపిసోడ్ మంచి వ్యూస్ ను అందుకుంటోంది. తాజాగా ఈ ఆదివారం ‘వైఫ్ ఊరెళితే’ అనే కాన్సెప్ట్ తో మేకర్స్ జనం ముందుకొచ్చారు. పెళ్ళాం ఊరెళితే… మొగుడు ఏం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు! ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే ’30 వెడ్స్ 21′ సీజన్ 2 ఎపిసోడ్ 4 మాత్రం అలానే మొదలైనా చక్కని ట్విస్ట్ తో ముగిసింది.
ఉద్యోగంలో చేరిన మేఘన ఆఫీస్ వర్క్ తో బిజీ అయిపోతుంది. ఆమె కన్సెప్ట్ కు ఖుషీ అయిన కావ్య, జెస్సీతో పాటు బెంగళూరు ఆఫీస్ ట్రిప్ కు మేఘననూ తీసుకెళుతుంది. ఓపక్క మేఘనకు రెండు రోజుల పాటు దూరంగా ఉండాలని పృథ్వీ బాధపడుతూ ఉంటే, మరో పక్క జెస్సీ రెండు రోజులు ఊళ్ళో ఉండదు కదాని కార్తీక్ ఆనంద పడతాడు. అతను ప్లాన్ చేసినట్టుగానే ఆ రోజు పృథ్వీ ఇంటిలో ఊహించని అతిథుల కారణంగా మందు పార్టీ జరిగిపోతుంది. సరిగ్గా అప్పుడే బెంగళూరు నుండి ఫోన్ చేసిన జెస్సీ… కార్తీక్ డ్రింక్ చేశాడని తెలిసి బాధపడుతుంది. ఆ బాధలోనే తాను ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ ను చెప్పేస్తుంది. అంతే!! కార్తిక్ కు తాగిన మత్తు అంతా ఒక్కసారి దిగిపోతుంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఈ శుభఘడియను ఇలాంటి స్థితిలో వినడం అతనికే బాధను కలిగిస్తుంది. తన ఆనందాన్ని పృథ్వీతో అతను ఎలా పంచుకున్నాడు? జెస్సీ వచ్చే సరికీ ఆమెను ఎలా రిసీవ్ చేసుకున్నాడు? జాబ్ లోని ఒత్తిడి కారణంగా మేఘన పృథ్వీ పట్ల ఎలా అసహనంగా ప్రవర్తిస్తోందన్నది ఈ ఎపిసోడ్ సారాంశం.
Read Also : Umair Sandhu : రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ.. అలా ఉందట..
పృథ్వీ, మేఘనగా చైతన్యరావు, అనన్య శర్మ ఎప్పటిలానే చేశారు. కానీ ఈ ఎపిసోడ్ లో మెయిన్ హైలైట్ మాత్రం కార్తీక్ పాత్ర పోషించిన మహేందర్ దే! అప్పటి వరకూ మందు ఎప్పుడు గొంతులోకి దిగుతుందా అంటూ ఎదురుచూసి హ్యాపీగా నాలుగు పెగ్గులేసిన, అతనికి భార్య నుండి ఫోన్ రావడం.. ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పిన తర్వాత అతని రియాక్షన్… సూపర్! ఎపిసోడ్ ప్రారంభం నుండి ముగింపు వరకూ మహేందర్ చక్కగా నడిపేశాడు. అయితే స్కాలర్ వాళ్ళను మరీ మందు సప్లయర్స్ గా చూపించకుండా ఉంటే బాగుండేది. అలానే ‘అఖండ’ సినిమాలో తమన్ బీజీఎంతో చెవుల్లోంచి రక్తం కారిందన్న సెటైర్ కూడా సరైంది కాదు. ఈ డైలాగ్ తో బాలకృష్ణ, తమన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఆస్కారం ఉంది. పృథ్వీ వనం దర్శకత్వంతో పాటు జోస్ జిమ్మి సంగీతం, పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా కార్తీక్ కు వేసే బీజీఎం బిట్ అయితే కేక! లాస్ట్ వీక్ కాస్తంత నిరాశ కలిగించిన ’30 వెడ్స్ 21′ ఈ వారంతో మళ్ళీ గాడిలో పడినట్టు అయ్యింది. పైగా ఇందులో కామెడీతో పాటు చక్కని సెంటిమెంట్ ను మిళితం చేయడం బాగుంది.