2022 Filmy Rewind: సినిమా నిర్మాణం కోట్లతో కూడుకున్న వ్యాపారం. కొత్త వారిని నమ్మి లక్షలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం అంటే మాటలు కాదు. కానీ చిత్రంగా తెలుగులో ప్రతి యేడాది నలభై, యాభై మంది కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో విజయం సాధించే వారు ఐదారు శాతమే! ఎప్పటిలానే ఈసారి కూడా స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ నూతన దర్శకులకు కలగలేదు. అయితే, తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న కొందరు యువ దర్శకులు మాత్రం తమ సత్తాను చాటారు. చిత్రంగా పరభాషల నుండి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన సీనియర్స్ తీవ్ర నిరాశను కలిగించారు.
ఈ యేడాది పరిచయమయిన కొత్త దర్శకులలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు ఇద్దరు. అందులో ఒకరు ‘బింబిసార’ను తెరకెక్కించిన వశిష్ఠ కాగా మరొకరు ‘డి.జె. టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ. సినీ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడైన వేణు (వశిష్ఠ) గతంలో ‘ప్రేమలేఖ రాశా’ మూవీలో హీరోగా నటించాడు. నటన తనతో కాదనే నిర్ణయానికి వచ్చాక దర్శకత్వ శాఖ వైపు దృష్టి సారించాడు. ‘బింబిసార’ కథను పకడ్బందీగా తయారు చేసుకుని, నందమూరి కళ్యాణ్ రామ్ నే నమ్ముకుని ఆయనతోనే ఈ సినిమా చేయాలని భీష్మించుకుని కూర్చున్నాడు. ఆ నిరీక్షణకు ఫలితంగా చక్కని విజయాన్ని అందుకున్నాడు. దీనికి సీక్వెల్ కూడా వశిష్ఠతోనే తీస్తానని కళ్యాణ్ రామ్ మాట ఇచ్చారు. అలానే ఈ యేడాది చక్కని విజయాన్ని అందుకున్న మరో నూతన దర్శకుడు విమల్ కృష్ణ. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చక్కని విజయాన్ని సాధించడంతో సీక్వెల్ కూ నిర్మాత, కథానాయకుడు రెడీ అయ్యారు. అయితే దీనికి మాత్రం విమల్ కృష్ణ దర్శకుడు కాదట!
ఈ సంవత్సరం పరిచయమైన దర్శకులలో కాస్తంత గుర్తింపు తెచ్చుకున్న వారిలో ‘మసూద’ దర్శకుడు సాయికిరణ్, ‘స్వాతిముత్యం’ దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ, ‘యశోద’ దర్శకులు హరి-హరీష్ ఉన్నారు. బట్ కొత్త దర్శకులను నమ్మిన కథానాయకులకు మాత్రం కష్టాలు తప్పలేదు. ఈ యేడాది ప్రారంభమే నూతన దర్శకుడు ఎం. శ్రీనివాసరాజు తెరకెక్కించిన ‘ఇందువదన’ తో మొదలైంది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమా జనాలను మెప్పించలేకపోయింది. రానా ‘1945’ మూవీతో తమిళ దర్శకుడు సత్యశివ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ హిస్టారికల్ డ్రామా నిరాశకు గురిచేసింది. కళ్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’తో పులి వాసు దర్శకుడిగా పరిచయయయ్యాడు. ‘సెహరి’ మూవీతో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకుడయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్ భారీగా సాగింది కానీ ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’తో టీజీ కీర్తికుమార్, వరుణ్ తేజ్ ‘గని’తో కిరణ్ కొర్రపాటి, విక్రమ్ సహిదేవ్ ‘వర్జిన్ స్టోరీ’తో ప్రదీప్ బి అట్లూరి దర్శకులుగా పరిచయం అయ్యారు. కిరణ్ అబ్బవరం ఈ యేడాది మూడు సినిమాలలో నటిస్తే.. అందులోని ‘సమ్మతమే’తో గోపీనాథ్, ‘సెబాస్టియన్’తో ఎస్. బాలాజీ దర్శకులుగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ రెండు సినిమాలు కిరణ్ అబ్బవరానికి అచ్చిరాలేదు. ప్రియమణి నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘భామాకలాపం’ను అభిమన్యు డైరెక్ట్ చేశాడు. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అయ్యి వ్యూవర్స్ అటెన్షన్ డ్రా చేసింది.
ఈ యేడాది రెండు సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇద్దరు దర్శకులకు లభించింది. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’తో దర్శకుడిగా పరిచయం అయిన ఇషాన్ సూర్య.. మంచు విష్ణుతో ‘జిన్నా’ మూవీ తీశాడు. కానీ ఈ రెండు కూడా నిరాశనే కలిగించాయి. ఇదే బాటలో సాగారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో పాటుగా ‘బుజ్జీ ఇలా రా’ కూడా ఇదే యేడాది విడుదలైంది. కానీ ఈ రెండు కమర్షియల్ సక్సెస్ ను సాధించలేదు.
కొత్త దర్శకులు చాలామంది భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని తమ సత్తా చాటాలని ప్రయత్నించారు. కానీ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఈ కథలను తెరకెక్కించడంలో విఫలమయ్యారు. సుమ నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఆది పినిశెట్టి ‘క్లాప్’ మూవీ ఉత్తేజభరిత క్రీడా చిత్రమైనా దర్శకుడు పృథ్వీ ఆదిత్యకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆది సాయికుమార్ ‘బ్లాక్’తో మెగాఫోన్ పట్టుకున్న జి. బి. కృష్ణ కూడా సక్సెస్ పొందలేకపోయారు. రచయిత శరత్ మండవను మాస్ మహరాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’తో దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ మూవీ వర్కౌట్ కాలేదు. ప్రముఖ ఎడిటర్ రాజశేఖర్ రెడ్డిని నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీతో దర్శకుడిని చేశాడు. చేదు ఫలితమే దక్కింది. ‘హైదరాబాద్ బ్లూస్’తో దర్శకుడిగా మారి, ఆ పైన బాలీవుడ్ లో పలు చిత్రాలు తీసిన నగేశ్ కుకునూరు తీసిన తొలి తెలుగు సినిమా ‘గుడ్ లక్ సఖీ’ కూడా ఆడలేదు. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ఈ సినిమాను గట్టెక్కించలేకపోయారు.
శాంటో మోహన్ వీరంకి (స్టాండప్ రాహుల్), ఎస్.ఎస్. పట్నాయక్ (పద్మశ్రీ), హరి కొలగాని (షికారు), అప్సర్ హుస్సేన్ (గాంధర్వ), సలీమ్ మాలిక్ (దర్జా), జి. శేఖర్ (పంచతంత్ర కథలు), హనుమాన్ (కొత్తకొత్తగా), అశోక్ తేజ (ఓదెల రైల్వే స్టేషన్), ఎ. ప్రదీప్ (భళా చోరా భళా), వంశీధర్ గౌడ్- లక్ష్మీ నారాయణ (ఫస్ట్ డే ఫస్ట్ షో), సతీశ్ త్రిపుర (దొంగలున్నారు జాగ్రత్త), ప్రదీప్ వర్మ (అల్లూరి), వి. వి. రుషిక (ఇక్షూ), విశ్వ ఆర్ రావు (గీత), సవిత్ సి. చంద్ర (కవిసమ్రాట్), గౌతమ్ కృష్ణ (ఆకాశ వీధుల్లో), డి. ఈశ్వర్ బాబు (అఖండ భారత్), నిర్ణయ్ పల్నాటి (నేనెవరు), గంగాధర్ (ముఖచిత్రం) సినిమాల ద్వారా దర్శకులుగా పరిచయం అయ్యారు.
తమిళ చిత్రసీమ నుండి తెలుగు సినిమా రంగంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన లింగుస్వామి (వారియర్), శ్రీకార్తిక్ (ఒకే ఒక్క జీవితం), అశ్వత్ మారిముత్తు (ఓరి దేవుడా), ఎ. ఆర్. మోహన్ (ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం), అరుణ్ భారతి (చెప్పాలని ఉంది) విజయం సాధించలేకపోయారు. అలానే కన్నడిగ అయిన నాగశేఖర్ అక్కడ మంచి హిట్ చిత్రాలు తీశారు. కానీ తెలుగులో తొలిసారి ఆయన దర్శకత్వం వహించిన ‘గుర్తుందా శీతాకాలం’ పరాజయం పాలైంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. పార్తీబన్ నటించి, డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ను తెలుగులో ‘డేగల బాబ్జీ’గా వెంకట్ చంద్ర తెరకెక్కించారు. బట్ ఇక్కడ ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. రచయిత శ్రీధర్ సీపాన ‘వాంటెండ్ పండుగాడు’తో దర్శకుడు అయ్యి, చేదు అనుభవాన్ని మూట కట్టుకున్నాడు. ఇలా ఎంతోమంది కొత్త దర్శకులు ఈ యేడాది తమ అదృష్టం పరీక్షించుకుని పరాజయాలనే పొందారు. అయితే నిర్మాతలు కొత్త దర్శకులలో ఏదో విషయం ఉంటుందనే ఆశతో వారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు.
…