హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని లేకుండా ఎందరో నటీనటులు తమకు తెలిసిన అంశాలపైనో, లేక ట్రావెలింగ్ తోనో, కాకపోతే తమ ఆత్మకథలనో పుస్తకరూపంలో జనం ముందుంచారు. ఇవన్నీ నాన్ ఫిక్షన్ గానే పరిగణించారు. కానీ, ఓ నటుడు అందునా రెండు సార్లు బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను అందుకున్న టామ్ హ్యాంక్స్ లాంటివారు ‘ఫిక్షన్’తో ఓ నవలను రాయడం నిజంగా విశేషమే!పైగా తాను చుట్టూ చూసిన ‘రంగుల ప్రపంచం’ ఆధారంగానే ఈ నవలను రచించడం మరింత విశేషం! ఎందుకంటే సినిమా జనం తమ రంగం గురించి బయటి ప్రపంచానికి తెలియజేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ, టామ్ మాత్రం రచయితగా తన స్వేచ్ఛను వినియోగించుకుంటూనే ‘ద మేకింగ్ ఆఫ్ అనదర్ మేజర్ మోషన్ పిక్చర్ మాస్టర్ పీస్’ అనే నవలను పాఠకలోకానికి అందించారు. ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా మే 9న విడుదల కానుంది.
టామ్ హ్యాంక్స్ వంటి మేటి నటుడు రాసిన నవల కాబట్టి, ఖచ్చితంగా ‘ద మేకింగ్ ఆఫ్ అనదర్ మేజర్ మోషన్ పిక్చర్ మాస్టర్ పీస్’కు ఎంతో క్రేజ్ ఉంటుందని హాలీవుడ్ జనం అంటున్నారు. పైగా టామ్ హ్యాంక్స్ కు రచయితగా ఇదే తొలి నవల కావడం జనాల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ పుస్తకాన్ని చూసి చదివినవారు కొందరు ఉన్నారు. వారందరూ టామ్ రచనాశైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు. మహా మహా చేయితిరిగిన రచయితలు రాసిన రీతిన టామ్ రైటింగ్ స్టైల్ ఆకట్టుకుంటోందని ప్రశంసిస్తున్నారు. గతంలో ఆస్కార్ అవార్డ్ విన్నర్ మార్లన్ బ్రాండో డైరెక్టర్ డొనాల్డ్ కెమ్మెల్ తో కలసి ‘ఫ్యాన్ ట్యాన్’ అనే నవల రాశారు. బ్రాండో చనిపోయాక ఆ నవల వెలుగు చూసింది. నటుడు జీన్ హాక్ మన్ ‘వేక్ ఆఫ్ ద పెర్డిడో స్టార్’ అనే నవల రాశారు. నటుడు చక్ నోరిస్ రాసిన ‘ద జస్టిస్ రైడర్స్’, ఎథాన్ హాకే నవల ‘ద హాటెస్ట్ స్టేట్’ కూడా జనం ముందు నిలిచాయి. కానీ, ఏవీ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. కమెడియన్ స్టీవ్ మార్టిన్ రాసిన నవలలు ఆయన సినిమాలకంటే మిన్నగా అలరించాయి. మరి టామ్ హ్యాంక్స్ తన తొలి నవల ‘ద మేకింగ్ ఆఫ్ అనదర్ మేజర్ మోషన్ పిక్చర్ మాస్టర్ పీస్’ ద్వారా రచయితగా ఎలాంటి పేరు సంపాదిస్తారో చూడాలి. అన్నట్టు ‘ద మేకింగ్ ఆఫ్ అనదర్ మేజర్ మోషన్ పిక్చర్ మాస్టర్ పీస్’ ఇంగ్లిష్ నవల ఖరీదు మన ఇండియాలో రూ. 749.