Heart Risks: ఇటీవల కాలంలో దేశంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్ సంబంధిత వ్యాధులు వృద్ధులలో మాత్రమే బయటపడేవి. కానీ ఇప్పుడు పాతికేళ్ల లోపు వారిలోనూ గుండపోటు కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. మన ఆహార అలవాట్లు హృదయంపై ఏవిధంగా ప్రభావం చూపిస్తాయి, గుండెపోటు రావడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి, వాటిని నియంత్రించడానికి వైద్యులు సూచిస్తున్న సూచనలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Sound Alert System: కేంద్రం సంచలన నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ ఉండాల్సిందే!
కారణాలివే..
మానసిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి అనేది గుండెపోటుకు కారణంగా నిలుస్తోందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మానసిక ఒత్తిడి, పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహం: మధుమేహం (డయాబెటిస్) అనేది యువతలో గుండె జబ్బులకు ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు పేర్కొన్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలు తాజాగా వెలువడ్డాయి.
ఆహారపు అలవాట్లు: ఈ రోజుల్లో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోందని పేర్కొన్నారు. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.
జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..
అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుందని, ఇది గుండెపోటుకు దారితీస్తుందని చెబుతున్నారు. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది రక్తపోటును పెంచుతుందని చెప్పారు. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుందని వెల్లడించారు. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు అంటున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుందని, దీంతో గుండెపై ఒత్తిడి పెరుగుతుందని, ఊబకాయం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని సూచిస్తున్నారు.
వెంటనే జాగ్రత్తపడండి..
వీపు, గొంతు, ఛాతీ, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే ఉన్నట్టుండి ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, చెమటలు పడుతున్నా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్యులను కలవాలని చెబుతున్నారు. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలుగా గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని సూచిస్తున్నారు.
అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.
పురుషుల్లోనే ఎక్కువగా ఎందుకంటే..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో.. గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగిందని వెల్లడైంది. ఈ రెండు నివేదికలు ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయని చెప్పాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి, దాని ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీస్తుందని చెబుతున్నాయి. అధికంగా మద్యం తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందని, ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుందని దీని కారణంగా గుండెపోటు ముప్పు పెరుగుతుందని పేర్కొన్నాయి.
READ ALSO: Bathukamma After Dasara: ఇక్కడ దసరా తర్వాతనే సద్దుల బతుకమ్మ.. ఎక్కడో తెలుసా?