పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు రావడం చాలా సాధారణం. ఈ సమస్యల సమయంలో కొంతమంది పిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అటువంటి సందర్భాల్లో డాక్టర్ల సలహా మేరకు నెబ్యులైజర్‌ను ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నెబ్యులైజర్‌ను ఎప్పుడు పెట్టాలనే విషయంలో తల్లిదండ్రులు చాలాసార్లు గందరగోళానికి గురవుతుంటారు.
సాధారణంగా పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు శ్వాసలో ఇబ్బంది, గురక, వీజింగ్ (శ్వాస తీసుకునే సమయంలో శబ్దం రావడం) వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ సూచనతో నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తారు. అయితే ప్రతి సారి జలుబు లేదా దగ్గు వచ్చినపుడు నెబ్యులైజర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు పిల్లల్లో సర్వసాధారణమే అయినప్పటికీ, నెబ్యులైజర్ ఇవ్వాలా లేదా ఆవిరి సరిపోతుందా అనే సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుందని ఆయన తెలిపారు.
నెబ్యులైజర్ అనేది మందులను అందించే ఒక వైద్య పరికరమని డాక్టర్ సందీప్ గుప్తా తెలిపారు. ఇది ద్రవ రూపంలోని మందులను అతి చిన్న కణాలుగా విడగొట్టి, అవి నేరుగా పిల్లల ఊపిరితిత్తుల్లోకి చేరేలా చేస్తుంది. ఈ మందు కణాలు ఊపిరితిత్తుల్లోని వాపును తగ్గించడంలో, అధిక శ్లేష్మం ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి. నెబ్యులైజర్ మందులు ఊపిరితిత్తుల లోపల లోతుగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కియోలిటిస్, బ్రోన్కైటిస్, శ్వాసలో గురక, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యల్లో నెబ్యులైజర్లు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపారు.అయితే నెబ్యులైజర్‌ను ఎల్లప్పుడూ వైద్యుని పర్యవేక్షణలోనే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. నెబ్యులైజర్‌లో ఉపయోగించే మందులు సరైన మోతాదులో ఉండటం చాలా అవసరమని తెలిపారు.