Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!

Used Oil Tips

Used Oil Tips

Kitchen Hacks : పండుగలు, శుభకార్యాలు లేదా ఇంట్లో పిల్లలు, పెద్దలు ఇష్టపడినప్పుడు పూరీ, పకోడా, బజ్జీల వంటి వంటకాలను డీప్ ఫ్రై చేయడం సహజం. అయితే, ఇలా వండిన తర్వాత కడాయిలో మిగిలిపోయిన నూనెను మళ్లీ మళ్లీ వంటల్లో ఉపయోగించడం ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండెకు అస్సలు మంచిది కాదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం.. ఒకసారి వేడి చేసి నాణ్యత కోల్పోయిన నూనెను తిరిగి ఆహారంలో వాడకూడదు. మరి అలాంటప్పుడు ఆ నూనెను పారేయాలా? అంటే అవసరం లేదు. వంటకు పనికిరాకపోయినా, ఆ మిగిలిన నూనెతో ఇంట్లోనే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మొక్కల సంరక్షణ.. కీటకాలకు చెక్

తోటలోని మొక్కలను కీటకాల బారి నుంచి రక్షించడానికి వాడిన వంట నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొద్ది మొత్తంలో ఈ నూనెను నీరు , కొద్దిగా లిక్విడ్ సబ్బుతో కలిపి మొక్కలపై పిచికారీ చేయడం వల్ల నల్లులు, చిన్న చిన్న కీటకాలను సులభంగా నియంత్రించవచ్చు. అయితే, నూనెను నేరుగా మొక్కలపై అస్సలు చల్లకూడదు, అలా చేస్తే మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా, వారానికి ఒకసారి మాత్రమే ఈ మిశ్రమాన్ని మితంగా వాడాలి.

×
×
Ad

ఫర్నిచర్‌కు సరికొత్త మెరుపు

ఇంట్లోని బల్లలు, కుర్చీలు, హ్యాండిళ్లు లేదా తోటలోని పాత చెక్క వస్తువుల సంరక్షణకు ఈ నూనె చక్కటి సహాయకారిగా పనిచేస్తుంది. కొన్ని చుక్కల నూనెను పురాతన చెక్క వస్తువులపై పూసి తుడవడం వల్ల వాటి ఉపరితలాలు నునుపుగా మారి, చక్కటి పోషణ అందుతుంది. ఇది చెక్క పగలకుండా కాపాడటమే కాకుండా కొత్తదనం, మెరుపును అందిస్తుంది. అయితే ఫర్నిచర్ అంతటా పూసే ముందు, చెక్క ఆ నూనెను సరిగ్గా పీల్చుకుంటుందో లేదో చూడటానికి ఒక చిన్న భాగంలో పరీక్షించి చూసుకోవడం మంచిది.

పనిముట్ల తుప్పు వదిలించండి

తోటపని కోసం వాడే కత్తెరలు, గునపాలు లేదా ఇంట్లో ఉండే ఇతర లోహ వస్తువులు కాలక్రమేణా తుప్పు పట్టడం మొదలవుతుంది. ఈ సమస్య నివారణకు ఒక కాటన్ గుడ్డపై కొద్దిగా పాత నూనెను వేసి ఆ వస్తువులను బాగా తుడవాలి. ఇలా చేయడం వల్ల లోహ వస్తువుల మెరుపు పెరగడమే కాకుండా, అవి త్వరగా తుప్పు పట్టకుండా రక్షణ పొందుతాయి.

తలుపుల కిర్రుమనే శబ్దాలకు గుడ్ బై

ఇంట్లో తలుపులు లేదా కిటికీలు తీసేటప్పుడు, వేసేటప్పుడు వచ్చే కిర్రుమనే శబ్దాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. వీటి అతుకులకు (హింజెస్) కొద్దిగా ఈ నూనెను పూయడం ద్వారా శబ్దాలను పూర్తిగా అరికట్టవచ్చు. ఇది ఒక అద్భుతమైన లూబ్రికెంట్ లా పనిచేసి రాపిడిని తగ్గిస్తుంది. అయితే, నూనెను మరీ ఎక్కువగా పూస్తే దుమ్ము, ధూళి త్వరగా పేరుకుపోయే అవకాశం ఉంది కాబట్టి అవసరమైనంత మేరకే వాడాలి.

చెత్తబుట్టల దుర్వాసనకు చెక్

కొన్నిసార్లు చెత్తబుట్టలో తడి చెత్త పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. దీనికి పరిష్కారంగా.. చెత్తబుట్టను శుభ్రం చేసిన తర్వాత, దాని లోపలి భాగంలో కొద్దిగా నూనె రాయాలి. ఇలా చేయడం వల్ల చెత్త సంచులు (డస్ట్ బిన్ కవర్లు) డబ్బా అడుగు భాగానికి అంటుకోకుండా ఉంటాయి. ఒకవేళ పొరపాటున ప్లాస్టిక్ సంచి చిరిగినా కూడా లోపలి ద్రవాలు డబ్బాకు అంటుకోవు. దీనివల్ల బ్యాక్టీరియా చేరక దుర్వాసన రాకుండా ఉంటుంది , బుట్టను ఖాళీ చేయడం కూడా సులభతరం అవుతుంది.