గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మాట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్‌కు వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో బంధువుల ఉన్నప్పటికీ మాట మంచీ లేకుండా పోతోంది. ఇదే కేటగిరీకి చెందిన, 30 ఏళ్లు దాటినా పెళ్లి కాని ఓ వ్యక్తి కథను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ అబ్బాయి పేరు మహేశ్.. ఆస్తి పాస్తులు.. మంచి ఉద్యోగం.. అందం అన్నీ ఉన్నాయి. వివాహం చేయడానికి చాలా సంబంధాలు చూస్తున్నారు.. అయినా మహేశ్‌కు అమ్మాయిలు సెట్ కావడం లేదు. దీంతో 30 ఏళ్లు దాటిపోతోంది. నెత్తిన బొచ్చు రాలిపోతోంది. అబ్బాయి పెళ్లి జరుగుతుందోలేదోనని అతడి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. మహేశ్ సైతం తనకంటూ ఓ తోడు కావాలని ఎదురు చూస్తున్నాడు. చాలా సంబంధాలు చూసినప్పటికీ.. ఏదో వంకతో నో చెబుతున్నారు. అసలే మహేశ్ కులంలో అమ్మాయిల శాతం తక్కువ. తనకంటే చిన్న వయసున్న వాళ్ల పెళ్లిళ్లు అవుతున్నాయి. “పెళ్లి ఎప్పుడు? మహేశ్ పప్పన్నం ఎప్పుడు పెడతావ్?” ప్రస్తుతం మహేశ్ ఏ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లినా ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలు సంధించినప్పుడల్లా మహేశ్ తన బయటికి నవ్వుతూ సమధానం ఇచ్చిన లోలోల మాత్రం అతని బాధ వర్ణణాతీతం. బంధువులే కాదు.. తోటి ఉద్యోగులు సైతం వీళ్ల పెళ్లి ఎప్పుడు అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. తనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అని ఆలోచిస్తున్న మహేశ్‌కి ఇదే సమస్యతో బాధ పడుతున్న ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ సహుద్యోగులు. ఇద్దరి బాధలు, వయసులు దాదాపు సమానమే.
వీరిద్దరే కాదు.. ప్రస్తుత సమాజంలో ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. మ్యాట్రిమోనియల్ సైట్లు, ఆయా కులాలకు చెందిన ప్రత్యేక సైట్లులో వేలాది మంది పెళ్లి కాని ప్రసాదులు దర్శన మిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం.. అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏం ఉద్యోగం, ఎంత జీతం, ఆస్తిపాస్తులు, సెల్ఫ్ అకౌంట్‌లో సేవింగ్స్ ఎంత, సొంతంగా సైట్ లేదా సొంత ఇల్లు, కారుందా? అనే మాట వినిపిస్తోంది. వివాహానంతరం వారిద్దరే వేరుగా ఉండాలనే మాట అమ్మాయి, వారి తల్లిదండ్రు ల్లో వినిపిస్తోంది. దీంతోపాటు జాతకాలు, అబ్బాయిల వ్యక్తిగత విషయాలపై వే గుల విచారణ ఎక్కువైంది. వీరు అబ్బాయి ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రా, ఎక్స్‌తోపాటు జీమెయిల్‌లో సెర్చింగ్ ఆధారంగా గర్ల్ ఫ్రెండ్స్, వారి అలవాట్లను కనుక్కుని పెళ్లి చేసుకోవాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నా రు. దీంతో అబ్బాయిలకు అన్నీ ఉండీ మూడు పదులు దాటినా అమ్మాయిలు దొరక్క వారు పడుతున్న కష్టం కంటే వారి తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతంగా మారింది.
ఆరా తీయడంతో విఫలం..
తమ పిల్లను పలానా వాళ్లు అడిగారు, వారి అబ్బాయి మంచోడేనా కనుక్కోవాలని పెళ్లి కుమార్తె తరఫువారు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. దీంతో వారు ఓకే అంటే పర్వాలేదు గానీ.. అబ్బాయికి ఎదో అలవాట్లున్నాయని, లేదా చెప్పిన జీతం అంత లేదని, అసలు సాఫ్ట్‌వేర్ కాదని, ఏదో విషయంలో తప్పులు చెప్పారని సమాచారం ఇస్తే ఇక పెళ్లి కథ కంచికి చేరుతోంది. వందల అబద్ధాలు చెప్పైనా ఓ పెళ్లి చేయలన్నారు పెద్దలు.. కానీ ఇక్కడ కొంత మంది మాత్రం ఇరుగుపొరుగు వారి వదంతులు నమ్మి సంబంధాలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
నోట్: ఈ కథనంలో పేర్కొన్న పేర్లు కల్పితాలు మాత్రమే..