నవ మాసాల ప్రయాణం తర్వాత… పండంటి పసి బిడ్డ ఒళ్లోకి వచ్చాక… అప్పటి వరకూ అనుభవించిన భాధలన్నింటినీ ఎవరో చేత్తో తీసేసినట్టుగా ఆ తల్లి ఇట్టే మర్చిపోతుంది. పసి బిడ్డ బోసి నవ్వుల్ని చూస్తూ తనని తానే మైమర్చిపోతుంది. మొత్తంగా అమ్మదనంలోని కమ్మదనాన్ని, మాతృత్వపు మధురిమల్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తుంది. అయితే… ఇందుకు భిన్నంగా కొంతమంది అమ్మలు… పూర్తిగా నిరాశలో కూరుకుపోతుంటారు. పండంటి బిడ్డ పక్కలో కదులుతున్నా ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. అంతులేని నైరాశ్యం కనిపిస్తుంటుంది. నిరాశ, నిస్పృహ, చిరాకు, కోపంతో సతమతం అవుతూ తీవ్రమైన మనో వేదనకు లోనవుతుంటారు. ఉన్నట్టుండి ఊరికే ఏడ్చేస్తుంటారు. ఒక్కోసారి తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళుతుంటారు. ఈ రకమైన పరిస్థితిని ప్రసూతి నిర్వేదంగా(పోస్ట్ పార్టమ్ డిప్రెషన్) పిలుస్తారు.
ప్రసూతి నిర్వేదం లక్షణాలు:
ఆందోళన
విచారం
చికాకు
మూడ్ స్వింగ్స్
ఏకాగ్రత లోపించడం
ఆకలి లేకపోవడం
నిద్ర పట్టకపోవడం
ఎక్కువగా ఏడవడం
బిడ్డతో సరైన బంధం ఏర్పరుచుకోకపోవడం
కుటుంబం, బంధువులకు దూరంగా ఉండాలనిపించడం
విపరీతమైన నీరసం, శక్తి విహీనంగా ఉండడం
చిన్న విషయాలకే కోపం రావడం
నిరాశగా అనిపించడం
నిర్ణయాలు తీసుకోలేకపోవడం
ప్రసవానంతరం మహిళలు ఎదుర్కొనే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ప్రభావం వారిపై మూడేళ్ల వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొత్తగా తల్లి అయిన వారు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ను ఎదుర్కొంటారు. కానీ దీన్ని మన దేశంలో చాలా మంది పట్టించుకోరు. దీని ప్రభావం గతంలో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కాలం ఉండవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రసవమైన తరువాత ప్రతి నలుగురు తల్లుల్లో ఒకరు మూడు సంవత్సరాల వరకు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (యుఎస్ఎ) నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.
అమ్మదనపు ఆనందం ఓ వైపు. అంతలోనే అంతులేని నైరాశ్యం మరోవైపు… ఈ చిత్రమైన పరిస్థితి అమ్మని అనుక్షణం చిత్రవధ చేస్తుంటుంది. కాన్పు తర్వాత శారీరకంగా, మానసికంగా కమ్ముకొచ్చే సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. రక్తహీనత, బిడ్డ పెంపకం, బాధ్యతల గురించి భయం, చాలినంత నిద్ర లేకపోవడం, ఒంట్లో హార్మోన్లలో మార్పులు, చిన్న వయసులోనే బిడ్డకు జన్మను ఇవ్వడం… ఇవన్నీ అపుడే తల్లిగా మారిన ఆమెను తీవ్రమైన భయాందోళనలకు గురి చేస్తుంటాయి. కాన్పు తర్వాత జీవితం నిస్సారంగా అనిపిస్తుంటుంది. మానసికంగా కుంగిపోతుంటారు. అకారణంగా అదేపనిగా ఏడవటం, బిడ్డను పెద్దగా పట్టిచుకోకుండా తమకేమీ సంబంధం లేనట్టు ప్రవర్తించటం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. తమతో పాటు బిడ్డ బాగోగులను చూసుకోలేమోనన్న బాధ మనసులో తీవ్రంగా వేధిస్తుంటుంది. ఈ ప్రసూతి నిర్వేదానికి సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే నెలలు, ఏళ్ల కొద్దీ వేధిస్తుంది. ఈ నిర్వేదం తల్లి ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాదు. బిడ్డ ఎదుగుదలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రసూతీ నిర్వేదానికి కౌన్సిలింగ్, చికిత్సలు, సురక్షితమైన మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల ఆధారంగా డిప్రెషన్ తీవ్రతను అంచనా వేసి ఈ మందులను ఇస్తారు. బిడ్డ ఆరోగ్యానికి ఈ మందులు ప్రమాదమేమోనని చాలామంది మందులు వేసుకోవడానికి భయపడతారు. కానీ అందులో నిజం లేదు. తల్లిపాల నుంచి బిడ్డకు మందులు చేరుకోవడం అన్నది చాలా తక్కువ. మందులు వేసుకోకపోతేనే ఎక్కువ హాని జరుగుతుంది. తల్లిని, బిడ్డను గమనిస్తూ సరైన మోతాదులో మందులు వాడుకుంటే ఇలాంటి ఇబ్బందీ ఉండదు. సరైన సమయంలో మందులు తీసుకుంటే సమస్య ముదరకుండా అడ్డుకోవచ్చు. డిప్రెషన్ నుంచి తల్లి బయటపడితేనే తల్లీబిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. తల్లి ఆరోగ్యమేకాదు, బిడ్డ ఆరోగ్యమూ మెరుగవుతుంది.
మందులతో పాటు కౌన్సెలింగ్ తీసుకోవడం కూడా ఈ ప్రసూతీ నిర్వేదానికి చాలా మేలు చేస్తుంది. దీన్నే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. ఇందులో ప్రతి కూల ఆలోచనల్ని ఎలా నియంత్రించుకోవాలి, రోజువారి పనులు ఎలా చేసుకోవాలి, బిడ్డను ఎలా చూసుకోవాలి అనేవి నేర్పిస్తారు. తల్లితో పాటు కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్ ఇస్తారు.
మన కుటుంబాల్లో గర్భిణీల మీద చాలా శ్రద్ధ పెడతారు కానీ కాన్పు అయ్యాక అదంతా బిడ్డ మీదకు మళ్లుతుంది. దీంతో తల్లి భావోద్వేగాలను పెద్దగా పట్టించుకోరు.ఈ క్రమంలో డిప్రెషన్ లక్షణాలను విస్మరించే అవకాశముంది. కాబట్టి తల్లినీ ఓ కంట కనిపెట్టుకుని ఉండడం ఎంతైనా అవసరం.
కాన్పుఅయ్యాక దిగులుగా, భయంగా ఉన్నట్టు అనిపిస్తుంటే కుటుంబ సభ్యులకు వీటి గురించి చెప్పడం చాలా ముఖ్యం. దీంతో బిడ్డ అవసరాలను కుటుంభ సభ్యులు, పెద్దవాళ్లు చూసుకోవడానికి వీలుంటుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. తగిన ప్రశాంతత లభిస్తుంది. మనసు కాస్త కుదుటపడుతుంది.
కుటుంబ సభ్యులు కూడా తల్లి చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి. కాన్పు తర్వాత అందరికీ ఎదురయ్యేదే అని కొట్టిపారేయడం మంచిది కాదు. తల్లికి దన్నుగా ఉండాలి. మానసికంగా భరోసా కల్పించాలి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలి. రాత్రి సరిగా నిద్ర పోనట్టయితే బిడ్డను మేం చూసుకుంటాం, నీవు కాసేపు హాయిగా నిద్రపో అని సముదాయించొచ్చు. ఇలాంటి తోడ్పాటు లభిస్తే తల్లికి చాలా హాయిగా ఉంటుంది. మనో నిబ్బరం పెరుగుతుంది.
కాన్పు తర్వాత సహజంగానే తండ్రి బాధ్యత కూడా పెరుగుతుంది. తల్లీ బిడ్డ ఇద్దరి అవసరాలను చూసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో తల్లి కుంగుబాటుకు లోనైతే తండ్రిమీద కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ప్రసూతీ నిర్వేదానికి తగిన చికిత్స తీసుకోకపోతే కొందరిలో సమస్య మరీ విషమించి భ్రాంతులకు లోనయ్యే స్థితికీ చేరుకుంటుంది. దీన్నే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. దీని బారిన పడ్డవారికి భ్రాంతులు కలుగుతుంటాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా చెవిలో ఏవేవో మాటలు వినిపిస్తున్నట్టు భ్రమిస్తుంటారు. అవనసరమైన అనుమానాలు వస్తుంటాయి. తన గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారనో, తన మీద ఎవరో కుట్ర చేస్తున్నారనో భావిస్తారు. ఇదొక ఎమర్జెన్సీ సమస్య. వెంటనే చికిత్స అందించాలి.
కాన్పు తర్వాత కనిపించే నిర్వేదం చాలామందిలో త్వరగానే సర్దుకుంటుంది. కొంతమంది రోజుల వ్యవధిలోనే తిరిగి మామూలు జీవితంలోకి వచ్చేస్తుంటారు. పసిబిడ్డ ఆలనాపాలన చూసుకుంటూ మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. చాలా కొద్ది మందిలో మాత్రం ప్రసవానంతర నిర్వేదం తీవ్రమై సైకోసిస్ స్థితిలోకి వెళ్తుంటారు. ఇలాంటపుడు మానసిక వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాన్పు తర్వాత తలెత్తే నిర్వేదాన్ని అధిగమించడానికి కుటుంబ సభ్యుల తోడ్పాటు చాలా అవసరం. కాన్పు అనంతరం డిప్రెషన్ లక్షణాలు కనబడుతున్నపుడు… తమ ఆలోచనల గురించి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించాలి. వారితో ఎక్కువ సమయం గడపటం మంచిది. ఎప్పుడూ ఇంటికే అంటుకుపోకుండా, వీలైనప్పుడల్లా బయటకు వెళ్తుండాలి. సురక్షితమైన ప్రదేశాలకైతే బిడ్డను కూడా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఇది తల్లీ బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది.
ప్రసవం జరిగిన వెంటనే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లక్షణాలు ఉన్నట్లనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకుంటే దీని గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.
Dr Swapna Samudrala
MS(Obstetrics and Gynaecology)
BirthRight By Rainbow hospitals, Banjara Hills Hyderabad,
Contact: 8882 046 046
www.rainbowhospital.in