Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Masala Gutti Vankaya Recipe: తెలుగు వారి వంటకాల్లో కూరగాయల రారాజుగా పేరొందిన వంకాయతో ఎన్ని రకాల కూరలు చేసినా, “మసాలా గుత్తివంకాయ” రుచే వేరు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, దావత్‌లలో ఘుమఘుమలాడే బగారా అన్నం లేదా పలావ్ పక్కన గుత్తివంకాయ కూర వడ్డించకపోతే ఆ విందు అసంపూర్ణంగానే అనిపిస్తుంది. కేటరింగ్ వాళ్లు వండే ఈ కూరలో ఉండే ఆ చిక్కటి, సువాసనభరితమైన గ్రేవీ, వంకాయ లోపలిదాకా ఇంకిన ఘాటైన మసాలా ప్రతి ముద్దలోనూ అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి.
చాలామంది ఇంట్లో ఎంత ప్రయత్నించినా ఫంక్షన్లలో దొరికే ఆ కేటరింగ్ టేస్ట్ ఎందుకు రావడం లేదని అనుకుంటారు. కానీ సరైన కొలతలతో దినుసులు వేయించి తయారుచేసే ప్రత్యేకమైన మసాలా పేస్ట్, వంకాయలను మగ్గించే పద్ధతి తెలిస్తే చాలు.. హోటల్ లేదా కేటరింగ్ రుచిని తలదన్నేలా మన ఇంట్లోనే చాలా తేలికగా దీనిని సిద్ధం చేసుకోవచ్చు. వేడివేడి తెల్లన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, రోటీ, చపాతీ, నాన్లతో ఆరగించినా ఈ కూర సరిజోడుగా నిలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? కేటరింగ్ స్టైల్లో నోరూరించే ఈ మసాలా గుత్తివంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
Also Read
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
కావలసిన పదార్థాలు:
మసాలా పేస్ట్ కోసం:
* వేరుశెనగలు (పల్లీలు) – 1 టేబుల్ స్పూన్
* దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క
* యాలకులు – 2
* లవంగాలు – 4
* ధనియాలు – 2 టీస్పూన్లు
* జీలకర్ర – 1/2 టీస్పూన్
* మెంతులు – 1/4 టీస్పూన్
* తెల్ల నువ్వులు – 1 టేబుల్ స్పూన్
* గసగసాలు – 1 టీస్పూన్
* తగినన్ని నీళ్లు (గ్రైండ్ చేయడానికి)
కూర & గ్రేవీ కోసం:
* లేత మువ్వ వంకాయలు – 1/4 కేజీ
* నూనె – 4 టేబుల్ స్పూన్లు (వంకాయలు మగ్గించడానికి 2 టేబుల్ స్పూన్లు, గ్రేవీకి 2 టేబుల్ స్పూన్లు)
* జీలకర్ర – 1/2 టీస్పూన్
* పచ్చిమిర్చి – 2 (నిలువుగా చీల్చినవి)
* ఉల్లిపాయ – 1 మీడియం సైజు (సన్నగా తరిగినది)
* కరివేపాకు – కొద్దిగా
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
* టమాటా ప్యూరీ – 2 మీడియం సైజు టమాటాల గుజ్జు
* పసుపు – 1/4 టీస్పూన్
* కారం – 1 1/2 టీస్పూన్
* ఉప్పు – రుచికి తగినంత
* నీళ్లు – 1 కప్పు
* కొత్తిమీర తరుగు – కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. పల్లీలు కాస్త వేగాక దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. చివరగా నువ్వులు, గసగసాలు వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. (మసాలాలు మాడిపోకుండా దోరగా వేయించాలి, మాడితే కూర చేదు వస్తుంది). ఈ దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ముందుగా పొడి చేసుకోవాలి. ఆపై తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు వంకాయలను తొడిమలు ఉంచి, మధ్యలోకి నాలుగు భాగాలుగా (గుత్తిలా) గాట్లు పెట్టుకోవాలి. వీటిని ఉప్పు వేసిన నీటిలో వేసి కడగాలి (దీనివల్ల వంకాయలు కసరెక్కకుండా ఉంటాయి). కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, వంకాయలను వేయాలి. అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. మూతపెట్టి లో-టు-మీడియం మంటపై మధ్యమధ్యలో కలుపుతూ వంకాయలు మెత్తగా మగ్గేంత వరకు వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
అదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక జీలకర్ర, చీల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి, నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గించాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి మసాలా అంతా దగ్గరపడి నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి.
అలా గ్రేవీ నుంచి నూనె వేరుపడుతున్నప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను వేసి మసాలాతో కలపాలి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా 1 కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఉప్పు సరిచూసుకొని అవసరమైతే మరికొద్దిగా ఉప్పు జోడించాలి. ఆ తర్వాత మూతపెట్టి తక్కువ మంటపై 10 నుంచి 15 నిమిషాల పాటు గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలేవరకు ఉడకనివ్వాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఇప్పుడు ఎంతో సువాసనతో కూడిన, నోరూరించే కేటరింగ్ స్టైల్ మసాలా గుత్తివంకాయ కూర సిద్ధం..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!