Kitchen Tips : భారతీయుల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల రోజువారీ ఆహారంలో బియ్యం ఒక ముఖ్యమైన భాగం. మనలో చాలా మంది రోజుకు రెండుసార్లు అన్నం తింటుంటారు. అయితే, అన్నం వండే ముందు బియ్యాన్ని పారుతున్న కుళాయి నీటితో రెండు మూడు సార్లు బాగా కడగడం అనేది అత్యంత ముఖ్యమైన దశ. కానీ మనలో చాలా మంది సమయం లేకనో, బద్ధకంతోనో బియ్యాన్ని నేరుగా రైస్ కుక్కర్‌లో లేదా గిన్నెలో వేసి ఉడకనిస్తుంటారు. మీరు కూడా ఇదే తప్పు చేస్తుంటే వెంటనే ఆపేయండి. బియ్యాన్ని సరిగ్గా కడగకపోతే అన్నం ముద్దగా అవ్వడమే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.
బియ్యాన్ని సరిగ్గా ఎలా కడగాలి?
ఫస్ట్ స్టెప్ : మీ రోజువారీ అవసరాలకు కావలసిన బియ్యాన్ని కొలత ప్రకారం తీసుకుని ఒక పెద్ద పాత్రలో వేయండి. అందులో బియ్యం పూర్తిగా మునిగేంత వరకు చల్లటి నీటిని పోయండి.
సెకండ్ స్టెప్: చేతులతో బియ్యాన్ని మెల్లగా కలపండి. దీనివల్ల బియ్యంపై ఉండే అదనపు పిండిపదార్థం (స్టార్చ్), జిగురు, దుమ్ము , చిన్న రాళ్లు విడిపోయి నీరు తెల్లగా లేదా గోధుమ రంగులోకి మారుతుంది.
థర్డ్ స్టెప్: ఇప్పుడు ఆ తెల్లటి నీటిని నెమ్మదిగా వంపేయండి. నీటితో పాటు బియ్యం బయటకు పోకుండా ఉండటానికి పాత్ర అంచుకు చేతిని అడ్డుగా పెట్టండి లేదా సన్నని జల్లెడను (Strainer) ఉపయోగించండి.
ఫోర్త్ స్టెప్: మళ్లీ నీళ్ళు పోసి, ఇదే ప్రక్రియను 3 నుండి 4 సార్లు పునరావృతం చేయండి. నీరు పూర్తిగా స్వచ్ఛంగా (Clear గా) మారే వరకు కడగాలి.
ఫిఫ్త్ స్టెప్: చివరగా, బియ్యాన్ని సుమారు 30 నిమిషాల పాటు శుభ్రమైన నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల బియ్యం మరింత సమర్థవంతంగా, త్వరగా ఉడుకుతుంది.
ఏ రకాల బియ్యాన్ని కడగాలి? ఏవి కడగకూడదు?
పొడవాటి గింజల బియ్యం (బాస్మతి, జాస్మిన్): వీటిని ఖచ్చితంగా కడగాలి. దీనివల్ల గింజలు విడివిడిగా, నునుపుగా తయారవుతాయి. పులావ్, బిర్యానీ , ఫ్రైడ్ రైస్ వంటి వంటకాలకు ఇది చాలా ముఖ్యం.
మధ్యస్థ గింజల బియ్యం (రిసోటో, పాయెల్లా): రిసోటో లేదా పుడ్డింగ్ వంటి వంటకాలు తయారుచేసేటప్పుడు బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వంటకాలకు క్రీమీ ఆకృతిని ఇచ్చేదే అందులోని పిండిపదార్థం.
పొట్టి గింజల బియ్యం (సుషీ రైస్): సుషీ తయారీకి ఉపయోగించే ఈ బియ్యాన్ని బాగా కడగడం ముఖ్యం. దీనివల్ల బియ్యం తగినంత జిగురుగా ఉంటుంది కానీ మరీ ముద్దగా అవ్వదు.
బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం): బ్రౌన్ లేదా ఎర్ర బియ్యంలో పిండిపదార్థం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ప్యాకింగ్ సమయంలో ఉండిపోయే దుమ్ము, మట్టి కణాలు లేదా పొట్టును తొలగించడానికి తేలికగా ఒకసారి కడగడం మంచిది.
ఈ బియ్యాన్ని అస్సలు కడగవద్దు
ఒకవేళ మీరు కొనే బియ్యం ప్యాకేజీపై “ముందే కడిగినవి” (Pre-washed) లేదా “తినడానికి సిద్ధంగా ఉన్నవి” (Ready to eat) అని రాసి ఉంటే, వాటిని మళ్లీ కడగాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇటువంటి బియ్యాన్ని రైస్ మిల్లులోనే అత్యాధునిక పద్ధతుల్లో శుభ్రపరిచి, దాని ఉపరితలంపై ఉండే అదనపు పిండి పదార్థాన్ని తొలగిస్తారు. కాబట్టి వీటిని నేరుగా వండేయవచ్చు.
శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్’ (NIH) నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. బియ్యాన్ని వండే ముందు కడగడం వల్ల దాని ఉపరితలంపై ఉండే అదనపు పిండిపదార్థపు ధూళి, ప్రాసెస్ చేసేటప్పుడు చేరిన రసాయనాలు, చిన్న రాళ్లు లేదా ఇతర మలినాలు సులభంగా తొలగిపోతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన , రుచికరమైన అన్నం కోసం బియ్యాన్ని కడిగి, నానబెట్టి వండటమే అత్యుత్తమ మార్గం.

