Anger Management: కోపం అనేది ఒక రకమైన ఎమోషన్. వాస్తవానికి కోపం ఎవరికైనా ఎప్పుడో ఒక సందర్భంలో వస్తుంది. రావాల్సిందే అంటున్నారు.. పలువురు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అదొక సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం అని చెబుతున్నారు. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. అది ఏమిటంటే.. కోపాన్ని సందర్భాన్ని బట్టి నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు.
READ ALSO: CM Chandrababu: ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నా!
అదే పనిగా కోప్పడం చాలా ప్రమాదకరం..
పలువురు పరిశోధకులు మాట్లాడుతూ.. కొందరు కోపాన్ని ప్రదర్శించడంలోనూ ఆనందాన్ని ఆస్వాదిస్తారని చెబుతున్నారు. అదే పనిగా కోప్పడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు. కోపం అనేది మనుషుల మధ్య దూరాన్ని పెంచడంతోపాటు, పలు రకాల అనారోగ్య సమస్యలకూ దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మీకు తెలుసా.. అతిగా కోప్పడే వారికి తలనొప్పి, రక్త పోటు(బ్లడ్ ప్రెషర్) అధికంగా ఉండటంతో పాటు, శ్వాస వేగంగా ఆడుతుందని చెబుతున్నారు. ప్రశాంతంగా ఉండే వారితో పోల్చితే కోపిష్టుల్లో ఆందోళన, వ్యాకులత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
కోపం ఎందుకు వస్తుందో తెలుసా..
ఆధునిక సాంకేతిక యుగంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులొచ్చాయి. ఇవే ప్రధానంగా చాలా మందిలో కోపానికి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ప్రేమ, పెళ్లి, ఇలా అనేక అంశాలు మనిషిలో కోపాన్ని పెంచేస్తున్నాయని చెబుతున్నారు. ఈ రోజుల్లో పిల్లలపై పరీక్షల పేరుతో ఒత్తిడి తీవ్రమవుతోందని అంటున్నారు. ఈ పరిణామాలు చిన్నప్పటి నుంచే చాలామంది పిల్లలను కోపిష్టులుగా తయారు చేస్తున్నాయని పేర్కొన్నారు.
మోనోమైన్ ఆక్సిడేస్ ఎ(MAOA) మరొక కారణం..
మాటిమాటికీ కోపంతో ఊగిపోవడానికి “మోనోమైన్ ఆక్సిడేస్ ఎ(MAOA)” అనే ఎంజైమ్ కూడా ఓ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ ఒక్కో వ్యక్తిలో ఒక్కో మోతాదులో ఉంటుందని, తక్కుత మోతాదులో ఉన్నవారు ఎక్కువగా కోప్పడతారన్న అభిప్రాయాన్ని నిపుణులు వెల్లడించారు. బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ యాంగర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ మైక్ ఫిషర్ మాట్లాడుతూ.. ఇలాంటి లక్షణాలు మిలటరీ సిబ్బందిలో, క్రీడాకారుల్లో ఎక్కువగా కనిపిస్తాయని వివరించారు.
కోపాన్ని అదుపులో ఉంచుకోడానికి ఏం చేయాలో తెలుసా..
ఈరోజుల్లో ప్రతి చిన్న విషయానికి కూడా చాలా మందికి కోపం వస్తుంది. ముందుగా ఇలాంటి వాళ్లు అసలు వాళ్లకు ఎందుకు కోపం వస్తుందో ఆలోచించుకోవాలి. అతిగా కోపానికి కారణం అవుతున్న అంశాల గురించి వారి సన్నిహితులతో చర్చించడం మంచిదని నిపుణులు సూచిస్తు్న్నారు. వారి నుంచి వచ్చే విలువైన సలహాలు, సూచనలు తీసుకోని, వాటిని అమలు చేసి కోపాన్ని జయించాలని చెబుతున్నారు.
కోపాన్ని అదుపు చేయడానికి వీటిని ట్రై చేయండి..
1. కాసేపు ప్రశాంతంగా నడవాలి.
2. బాగా ఇష్టమైన ప్రశాంతమైన సంగీతం వినాలి. దాంతో మెదడుపై ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
3. మనసును శాంతింపజేసేందుకు దీర్ఘ శ్వాస తీసుకుంటూ 10 వరకు అంకెలను లెక్కపెట్టాలి.
4. ఆల్కహాల్, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వెంటనే ఆపేయాలి.
5. మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయండి.
6. కంటి నిండా నిద్రపోతున్నారా లేదో చూసుకోవాలి.
7. బెడ్ మీద దిండును పిడికిలితో కొట్టాలి.
8. ఎవరూ లేని గదిలో లేదా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో గట్టిగా అరవాలి. కేకలు వేయాలి.
9. పుస్తక పఠనం, చిత్రలేఖనంతోనూ మనసును ప్రశాంతపరచుకోవచ్చు.
10. యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి.
11. సాధ్యమైతే నృత్యం చేయాలి, గంతులు వేయండి, నచ్చిన పాటకు స్టెప్పులేయండి.
మితిమీరిన కోపం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంటే.. ఒకసారి వైద్యున్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పే ‘యాంగర్ మేనేజ్‌మెంట్ కోర్సులు’, కౌన్సెలింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.