Bihar Assembly Elections 2025: దేశ వ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఒంటరి పోరుకు సిద్ధమై తొలి విడతలో భాగంగా 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తొలి విడతలో భాగంగా 51 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేశారు. ఇండియా కూటమిలో దాదాపు సీట్ల పంపకంపై చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు అందరి చూపు ఎన్డీఏ కూటమి వైపు ఉంది.
READ ALSO: Perni Nani: ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా.. పోలీసులు వినిపించుకోవడం లేదు!
రేపు ప్రకటించనున్న ఎన్డీఏ అగ్రనాయకులు
ఎన్డీఏ కూటమి అగ్రనాయకులు అక్టోబర్ 11న అధికారిక సీట్ల పంపకాల ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. BJP, JDU, LJP (రామ్ విలాస్), HAM, RLM వంటి పార్టీల అగ్ర నాయకులతో సహా అన్ని ప్రధాన NDA నాయకులు ప్రకటన సమయంలో హాజరు కానున్నారు. పలు నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ కూటమిలోని అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించి సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయానికి వచ్చింది. శనివారం ఢిల్లీలో బీజేపీ కీలక నాయకుల సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత ఎన్డీఏ సీట్ల కేటాయింపును ప్రకటించే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ సీట్ల పంపకాల ప్రక్రియకు నాయకత్వం వహిస్తుందని, కూటమి పార్టీలకు సరైన విధంగా సీట్ల పంపకాలు చేపడుతుందని అంటున్నారు. అనేక రోజుల నిరీక్షణ, చర్చల తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్ని కూడా చివరకు ఒక సాధారణ ఫార్ములాపై అంగీకరించాయని సమాచారం.
బీజేపీ, జేడీయూ మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరిందని, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జెపి (రామ్ విలాస్) 25-26 సీట్లు, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం పార్టీ 7-8 సీట్లు, ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎం 5-6 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. సీట్ల పంపకాలకు సంబంధించి రేపు జరిగే విలేకరుల సమావేశంలో అధికారిక ప్రకటన రానుంది. ఈ ప్రకటనతో కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని, అన్ని పార్టీలు ఐక్యంగా ఎన్నికలలో పోటీ చేస్తాయనే సందేశాన్ని ప్రజలకు, ప్రతిపక్షాలకు పంపాలని ఎన్డీఏ ఆశిస్తుంది. బీజేపీ వర్గాల ప్రకారం.. “ఈ సీట్ల పంపకాల ఏర్పాటు సంఖ్యల గురించి మాత్రమే కాదు, గౌరవం గురించి కూడా” అని పేర్కొన్నారు. సీట్ల పంపకాల ప్రకటనతో పాటు ఎన్డీఏ తన మొదటి ఉమ్మడి ప్రచారాన్ని ప్రకటించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.