NTV Telugu Site icon

Heart Attack: యువకుల్లోనే హార్ట్ ఎటాక్స్ ఎక్కువ.. కారణమేంటి?

Heart Attack

Heart Attack

దేశంలోని యువతకు గుండెపోటు టెన్షన్ పట్టుకుంది. గుప్పెడంత గుండె చిన్న వయసులోనే ముప్పుకు గురవుతోంది. దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు భయం వెంటాడుతోంది. వీరిలో ఎక్కువగా భారతీయులే ఉండటం కలవరపెడుతోంది. అయితే మహిళల కంటే పురుషుల్లోనే గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఓ సర్వేలో స్పష్టమైంది. గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో 21.4 శాతం, మహిళల్లో 12.7 శాతంగా ఉందని తేలింది. ఫిట్‌గా ఉన్నా కొంచెం ఫ్యాట్ ఎక్కువైనా గుండెపోటు వస్తుండటంతో ఏం చేయాలో ఎవరికీ అర్ధం కావడం లేదు.

సాధారణంగా గుండెపోటు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపు వాళ్లను కూడా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. ముఖ్యంగా ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవైనశైలి యువ హృదయాల్లో చిచ్చుపెడుతోంది. యుక్త వయసులో గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరు 40 ఏళ్ల కంటే తక్కువ వయసు వారే ఉంటున్నారు.

World Bicycle Day 2022: సైకిల్ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి

2000-2016 మధ్య ఈ చిన్న వయస్సులో గుండెపోటుల రేటు ప్రతి ఏడాది 2 శాతం పెరుగుతూ వస్తోంది. కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) ఇతర సమస్యలతో పాటు మయోకార్డియల్ ఇన్ఫాక్షన్(MI)కి దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇదే ఆకస్మిక మరణానికి దారితీస్తుందని చెబుతున్నారు. అయితే శారీరక శ్రమ లేకపోవడం, అతిగా మద్యపానం చేయడం, ధూమపానంతో పాటు అధిక శరీర బరువు, బీపీ, షుగర్‌లు వంటివి తక్కువ వయసులో గుండెపోటు రావడానికి కారణంగా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం, ప్యాక్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం నివారించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, ఉప్పు తగ్గించడంతో పాటు షుగర్, బీపీ చెకప్ చేయించుకోవాలని.. అంతేకాకంఉడా ధూమపానం మానుకుంటే గుండె సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు.