World’s First Licensing Deal: అధిక ధర కలిగిన క్యాన్సర్ మందు తయారీ కోసం నోవార్టిస్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్సింగ్ డీల్‌పై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా ట్రీట్మెంట్‌లో వాడే ఓరల్ డ్రగ్ నిలోటినిబ్‌ను రూపొందించనున్నారు. ఈ ఔషధాన్ని ఈజిప్ట్, గ్వాటెమాల, ఇండోనేషియా, మొరాకో, పాకిస్థాన్, ది ఫిలిప్పీన్స్, ట్యునీషియా వంటి ఏడు మధ్య ఆదాయ దేశాల్లో జనరిక్ డ్రగ్‌మేకర్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నారు.
Saudi Arabia: వెడల్పు 200 మీటర్లు, పొడవు 170 కిలోమీటర్లు.. మెగాసిటీని నిర్మిస్తున్న సౌదీ..
ఈ మందు తయారీపై నోవార్టిస్ ఏజీ అనే సంస్థకు పేటెంట్ ఉంది. అయినప్పటికీ ప్రజారోగ్యం దృష్ట్యా తొలిసారిగా ఈ వాలంటరీ లైసెన్స్‌ను జారీ చేసినట్లు ఐక్య రాజ్య సమితి మద్దతు గల మెడిసిన్స్ పేటెంట్ పూల్ అనే పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. జనం కోసం పెద్ద మనసు చాటుకుందని ప్రశంసించింది. పైన పేర్కొన్న ఏడు దేశాల్లో ఈ డ్రగ్ తయారీపై పేటెంట్లు పెండింగ్‌లో ఉన్నాయా లేదా అమల్లో ఉన్నాయా అనే అంశంలో కొంచెం సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా నోవార్టిస్ సంస్థ ముందుకు రావటం గొప్ప విషయమని ‘మెడిసిన్స్ పేటెంట్ పూల్’ పేర్కొంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా దాదాపు 10 మిలియన్‌ల మంది క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఇదే ఉంటోంది. ఈ రేటు పేద దేశాల్లో ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చికిత్స (ఔషధం) ఖరీదు ఎక్కువగా ఉండటం వల్లే పేదవాళ్లు క్యాన్సర్ మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కొన్ని దేశాల్లో అయితే పేషెంట్ల దగ్గర డబ్బులు ఉన్నా కొనుగోలు చేసేందుకు ఈ మందు అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి కేసులు అసలు నమోదే కావటం లేదు. ఈ డ్రగ్‌కి రియల్ మార్కెట్ ఎక్కడ ఉందో ఔషధ తయారీదారులూ పట్టించుకున్నట్లు కనిపించట్లేదు. ఒక వేళ పట్టించుకున్నా రేటు మాత్రం టూమచ్‌గా ఉంటోంది.