Heart Diseases: ఇటీవల కాలంలో గుండెకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. గతంలో గుండెపోటు అనేది ఎక్కువగా వయసు పైబడిన వారికి వచ్చే ఆరోగ్య సమస్యగా భావించేవారు. అయితే, ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ గుండె వైఫల్యాల వల్ల మరణిస్తున్నారు. అయితే, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనే రెండు భిన్నమైన కండిషన్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు గుండెకు సంబంధించిన విషయాలే అయినప్పటికీ, వీటి మధ్య వ్యత్యాసం ఉంటుంది.
గుండె ఎలా పనిచేస్తుంది..?
గుండె ఒక కండరం. ఇది రక్తాన్ని శరీరానికి సరఫరా చేయడానికి పంప్‌లా పనిచేస్తుంది. గుండె సంకోచించినప్పుడు అది రక్తాన్ని మన శరీర భాగాలకు పంప్ చేస్తుంది. గుండె కండరాలు పంపుగా ప్రభావవంతంగా పనిచేయాలంటే, కరోనరీ ధమనుల ద్వారా దాని కండరాలకు రక్తాన్ని పంపుచేయాలి. ఎప్పుడైతే ఈ ధమనుల్లో అవరోధాలు ఏర్పడుతాయో, గుండె కండరాలకు అవసరమైన రక్తం అందదు. దీని వల్ల గుండె కండరాలు గాయపడొచ్చు. లేదా చనిపోవచ్చు. గుండె సరిగా పనిచేయకపోవచ్చు.
గుండెపోటు మరియు కార్డియాక్ అరెస్ట్..
గుండెపోటుని సాంకేతికంగా ‘మయోకార్డియల్ ఇన్ఫార్షన్’’గా పిలుస్తారు. ఇది గుండె కండరాలకు గాయం లేదా కండరాల మరణాన్ని సూచిస్తుంది.
కార్డియాక్ అరెస్ట్ కొన్నిసార్లు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అని పిలుస్తారు. ఇది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మరో విధంగా చెప్పాలంటే సమర్థవంతంగా పంప్ చేయడం ఆగిపోతుంది. ఈ రెండు కూడా వేరువేరు కారణాల వల్ల కలుగుతాయి.
* గుండెపోటు సాధారణంగా కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. కొన్నిసార్లు కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ధమనుల గోడలపై కొవ్వు, పీచు కణజాలం పేరుకుపోయి ఓ నిరోధకంగా ఏర్పడుతుంది. రక్త నాళాన్ని అడ్డుకుంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది.
అథెరోస్కెరోసిస్ అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఆహారం, మధుమేహం, ఒత్తిడి, మానవుల్లో జన్యువులు కూడా కారణమవుతాయి. ధమనుల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ మరియు పోషకాలు అందవు. కాబట్టి గుండె కండరాల్లోని కణాలు గాయపడొచ్చు, చనిపోవచ్చు. ఇది గుండెపోటుకు కారణమవుతుంది.
* కార్డియాక్ అరెస్ట్ అనేది హృదయ క్రమరాహిత్య ఫలితంగా ఏర్పడుతుంది. ఇందులో శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేయడం గుండెకు కష్టతరంగా మారుతుంది. హృదయ స్పందనల్లో క్రమరాహిత్యాలు సాధారణంగా గుండెలో ఎలక్ట్రిక్ లోపాల కారణంగా ఉంటాయి. ఇవి నాలుగు విభిన్న రకాలు.
1) వెంట్రిక్యులర్ టాచీకార్డియా: హృదయ స్పందన నిమిషానికి 100 బీట్స్ కంటే ఎక్కువగా వేగవంతంగా ఉండే అసాధారణమైన గుండె లయ (సాధారణ వయోజన, విశ్రాంతి హృదయ స్పందన సాధారణంగా నిమిషానికి 60-90 బీట్స్). ఈ వేగవంతమైన హృదయ స్పందన గుండె రక్తంతో నింపబడకుండా నిరోధిస్తుంది మరియు తద్వారా తగినంతగా పంపింగ్ కాకుండా అడ్డుకుంటుంది.
2) వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్: రెగ్యులర్ బీట్‌లకు బదులుగా, గుండె వణుకుతుంది లేదా “ఫైబ్రిలేట్స్”, దీని ఫలితంగా నిమిషానికి 300 బీట్‌ల కంటే ఎక్కువ క్రమరహిత హృదయ స్పందన వస్తుంది.
3) పల్స్‌లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ: ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ తర్వాత గుండె కండరాలు తగినంత పంపింగ్ ఫోర్స్‌ని ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు ఉత్పన్నమవుతుంది, ఫలితంగా పల్స్ ఉండదు.
4) అసిస్టోల్: గుండెలో ఎలక్ట్రిక్ యాక్టవిటీ లేదని సూచిస్తుంది.
కార్డియాక్ అరెస్ట్ పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు కారణమని చెప్పబడుతుంది. కార్డియాక్ అరెస్ట్‌కి సంబంధించిన అనేక కారణాల్లో గుండెపోటు వంటి ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అత్యంత సాధారణ కారణం. ఇది అన్ని కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో 70 శాతం ఉంటుంది.
* గుండెపోటు కార్డియాక్ అరెస్ట్‌కి ఎలా కారణం అవుతుంది…?
గుండెపోటు సమయంలో, గుండె కండరాలు దెబ్బతినడం,కండరాలు చనిపోవడం జరుగుతుంది. ఈ దెబ్బతిన్న కణాజాలం విద్యుత్ సంకేతాలను నిర్వహించే గుండె సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కార్డియాక్ అరెస్టుకి కారణమవుతుంది. గుండెపోటు అనేది కార్డియాక్ అరెస్ట్‌కి ఒక కారణం అవుతుంది. కార్డియాక్ అరెస్ట్ అనేది సాధారణంగా గుండెపోటుకి కారణం కాదు.
* కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు:
అకాస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, పల్స్ లేదా హృదయస్పందన లేకపోవడం, శ్వాస ఆగిపోవడం, లేత తేదా నీలం రంగులో చర్మం కనిపించడం.
* గుండెపోటు లక్షణాలు:
గుండెపోటు సమయంలో సాధారణంగా ఛాతి నొప్పి, ఛాతి పట్టేసిన ఫీలింగ్ కలగడం, చేతులు వీపు మెడ, దవడ నొప్పులు కనిపిపస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. వికారం, తలనొప్పి, చెమటలు పట్టడం వంటివి కనిపిస్తాయి.
సాధారణంగా చెప్పాలంటే గుండెపోటు అనేది మన ఇంటికి నీటిని సరఫరా చేసే పైపులను అడ్డుకోవడం. కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది ఇంటికి వైరింగ్‌లో వచ్చే విద్యుత్ లోపం లాంటిది.