Fairness Cream: భారతదేశంలో చాలా మంది ఫెయిర్‌నెస్ క్రీములు వాడటం అలవాటుగా మారింది. చర్మం నిగారింపుగా కనిపించాలని చాలా మంది వీటిని వాడుతున్నారు. అయితే, వీటి వల్ల భారత్‌లో కిడ్నీ సమస్యలు పెరుగున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. భారతదేశం ఫెయిర్‌నెస్ క్రీమ్‌లకు లాభదాయకమైన మార్కెట్‌గా ఉంది. అయితే, వీటిల్లో ఉండే పాదరసం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తోంది.
కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ఈ క్రీముల్లో ఎక్కువగా పాదరసం ఉండటంతో మెంబ్రానస్ నెఫ్రోపతి(ఎంఎన్) కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి కిడ్నీ ఫిల్టర్‌లను దెబ్బతీస్తుంది. ప్రోటీన్ లీకేజీలకు కారణమవుతోంది. ఎంఎన్ అనేది ‘ఆటోఇమ్యూన్ డిజీజ్’’, దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతోందని, దీని వల్ల శరీరం నుంచి అధిక ప్రొటీన్ విసర్జింపబడుతోందని స్టడీ తేల్చింది.
పాదరసం చర్మం ద్వారా శరీరంలోకి చేరి, మూత్రపిండాల ఫిల్టర్లను నాశనం చేస్తున్నాయని, ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు దారి తీస్తుందని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ సజీష్ శివదాస్ వెల్లడించారు. భారతదేశంలోని పలు క్రీములు, చర్మం రంగుపై త్వరగా ప్రభావం ఉంటుందని ప్రకటనలు ఇస్తాయని, వినియోగాన్ని ఆపడం వల్ల చర్మం మరింత డార్క్ కలర్‌లోకి మారుతుందని ఆయన చెప్పారు. జూలై 2021, సెప్టెంబర్ 2023 మధ్య నివేదించబడిని 22 ఎంఎన్ కేసులపై అధ్యయనం జరిగింది. అలసట, తేలిక పాటి ఎడేమా, మూత్రంలో నురుగ లక్షణాలతో ఉన్న రోగులని పరిశీలిస్తే.. వీరిలో ముగ్గురు రోగులకు ఎడెమా ఉంది, కానీ మిగిలిన వారిందరిలో మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక రోగి మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కలిగి ఉన్నాడు.
22 మందిలో 68 శాతం అంటే 15 న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్-1 ప్రోటీన్ (NELL-1)కి ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. ఇది ఎంఎన్ వ్యాధి యొక్క అరుదైన రూపం. ఇది ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది. 15 మంది రోగులలో 13 మంది లక్షణాలు కనిపించకముందు స్కిన్ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు వాడినట్లు అంగీకరించారు. మిగిలిన వారిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ ఔషధాలను ఉపయోంచిన చరిత్ర ఉంది.