NTV Telugu Site icon

Heart Attack: చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.. కారణాలు ఇవే..

Heart Attack

Heart Attack

చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ సీజన్ వస్తే చాలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య కూడా చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. ఇతర సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో గుండెపోటు పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం..

ఉష్ణోగ్రతలు తగ్గిపోవటానికీ, గుండె జబ్బులకీ మధ్య సంబంధం..
వాతావరణ ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోవటానికీ, గుండె జబ్బులకీ మధ్య సంబంధం ఉందని స్వీడన్‌లోని లండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు మరోసారి నిరూపించారు. ముఖ్యంగా చలికాలంలో.. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తగ్గినప్పుడు ఈ ముప్పు మరింతగా పెరుగుతోందని వీరు నిర్ధారణకు వచ్చారు. ఇలా ఉష్ణోగ్రతలు సున్నా కంటే కిందికి పడిపోయినప్పుడు.. ఒక్క రోజులోనే గుండెపోటు వచ్చే ముప్పు నాలుగు రెట్లు పెరుగుతోందట. సూర్మరశ్మి తక్కువగా ఉండటం, చల్లగాలులు తీవ్రంగా వీచటం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం.. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరంలో ఉష్ణోగ్రతను నెగ్గుకొచ్చే శక్తి తగ్గిపోయి.. ఆ ప్రభావం నేరుగా ఒంట్లోని అవయవాల మీద పడుతోంది. (థర్మల్‌ కండక్షన్‌). దీంతో రక్తనాళాలు చలికి ప్రతిస్పందించి.. ధమనుల్లో రక్తపోటు పెరిగిపోయి.. తీవ్రమైన వణుకు, గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటోందని గుర్తించారు. కాబట్టి గుండె సమస్యలున్నవాళ్లు ఈ చలికాలంలో.. నేరుగా చలిలోకి వెళ్లకుండా కాస్త వెచ్చటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించటం ఉత్తమం!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తగినంత నీటిని తాగడం ద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో నుంచి మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేందుకు నీరు అవసరం. తగినంత నీరు తాగడం వల్ల మీ గుండె తన విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తప్పక తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. మీ గుండె పటిష్టంగా ఉంటుంది. మీ సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఉంటుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన, సమతులమైన ఆహారం తీసుకోవాలి. యాంటిఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఒత్తిడి మీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మీ ఒత్తిడిస్థాయిలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. గుండె జబ్బులకు ప్రధాన కారణం పొగ తాగడం. స్మోకింగ్ ఆపేస్తే మీ గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.