అధిక బరువు, ఊబకాయం సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. శరీర బరువును తగ్గించుకునేందుకు నానా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం చేస్తారు. మరికొందరు ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. జిమ్ ల్లో చేరి చెమటోడ్చుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళ నడుస్తుంటారు. అయితే ఇన్ని చేసినా కూడా బరువు తగ్గలేకపోతున్నామని నిరాశకు గురవుతుంటారు. ప్లాన్ ఎక్కడ మిస్ అవుతుందబ్బా అంటూ ఆలోచిస్తుంటారు. మరి మీరు రోజు వాకింగ్ చేస్తున్నా కూడా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో గమనించండి.
అహారపు అలవాట్లు:
బరువు తగ్గాలనుకునే వారు ఆహారం మితంగా తీసుకోవాలి. ప్రతి వంటకాన్ని ఆరగించాలని చూస్తే బరువు తగ్గాలన్న మీ ఆలోచనకు ఆటంకం కలిగినట్లే అవుతుంది. వాకింగ్ ద్వారా కేలరీలు ఖర్చు అవుతున్నా, అధిక కేలరీల వంటకాలు తీసుకుంటే ప్రయోజనం ఉండదు. తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.
నడకకు కేటాయించే సమయం:
నడకకు కేటాయించే సమయం కూడా మీరు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ సమయం నడవడం వల్ల శరీరానికి సరిపడ కేలరీలు బర్న్ కావు. కాబట్టి కనీసం రోజూ 30-45 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి.
తక్కువ నీరు తాగడం:
శరీరంలో నీరు సరిపడా లేకపోతే మెటాబాలిజం నెమ్మదిస్తుంది. తగినన్ని నీరు తాగడం ద్వారా శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది.
నిద్ర:
సరిపడ నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిద్రలేమి వల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి రోజుకి 7-8 గంటలు నిద్రపోవడం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు.
ఒత్తిడి:
అధిక ఒత్తిడివల్ల కార్టిసోల్ అనే హార్మోన్ పెరుగుతుంది. దీని వల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. ధ్యానం, యోగాతో ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఇలా కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తే అధిక బరువు సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది.