Long Covid-19: కోవిడ్ 19 వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్, అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీని వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ, వివిధ వేరియంట్ల రూపంలో మనుషులపై అటాక్ చేసింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కోవిడ్ సంక్రమిస్తూనే ఉంది.
Read Also: Supernova: విశ్వంలో భారీ నక్షత్రం పేలుడు.. “సూపర్ నోవా”ను గుర్తించిన జపాన్ శాస్త్రవేత్తలు
అయితే వ్యాక్సినేషన్ ద్వారా ప్రజలు ప్రస్తుతం కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అయితే దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కొన్ని సార్లు లాంగ్ కోవిడ్, క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు లాంగ్ కోవిడ్ విషయంలో ఓ విషయాన్ని కనుగొన్నారు. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వాడే ఔషధం ‘మెట్ ఫార్మిన్’ లాంగ్ కోవిడ్ కు చెక్ పెడుతున్నట్లుగా తేలింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ ద లాన్సెట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్’లో ప్రచురితమయ్యాయి. మెట్‌ఫార్మిన్ వాడటం వల్ల 10 నెలల్లో దాదాపుగా 40 శాతం మేర లాంగ్ కోవిడ్ ముప్పు తగ్గుతుందని వెల్లడైంది.
ఈ అధ్యయనం కోసం ఊబకాయం కారణంగా తీవ్ర కోవిడ్ ముప్పు పొంచి ఉన్న 30 ఏళ్లకు పైబడిన వారిపై స్టడీ చేశారు. కొందరికి మెట్‌ఫార్మిన్ మందును ఇచ్చి, మరికొందరికి సాధారణ మందులు ఇచ్చారు. ఆ తరువాత 10 నెలల పాటు వీరిని పరిశోధకులు గమనించారు. 30 రోజులకు ఒకసారి కొన్ని ప్రశ్నలను పంపి, వారి నుంచి వివరాలను సేకరించారు. సాధారణ మందులు వాడిన వారితో పోలిస్తే, మెట్‌ఫార్మిన్ వాడిన వారిలో తక్కువ మంది లాంగ్ కోవిడ్ బారినపడినట్లు గుర్తించారు. దీని వల్ల ఐసీయూలో చేరాల్సిన అవసరం 40 శాతం మేర తగ్గినట్లు వెల్లడైంది.