Health Risks of Using Refrigerated Dough for Rotis Explained : నేటి యాంత్రిక జీవనంలో సమయాన్ని ఆదా చేసుకోవడానికి చాలామంది పిండిని ఒకేసారి కలిపి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతున్నారు. ఉదయం కలిపిన పిండిని సాయంత్రం లేదా ముందు రోజు రాత్రి మిగిలిన పిండిని మరుసటి రోజు వాడటం చాలా ఇళ్లలో పరిపాటిగా మారింది. అయితే, ఇలా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పిండిని వాడటం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. పిండిని నిల్వ చేయడం వల్ల కలిగే నష్టాలు , నిపుణుల హెచ్చరికల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నిపుణుల హెచ్చరిక.. బ్యాక్టీరియా ముప్పు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిండిని ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల అది బ్యాక్టీరియా , ఫంగస్‌కు నిలయంగా మారుతుంది. ఇది నేరుగా మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫ్రిజ్‌లోని చల్లదనం పిండిలోని పులియబెట్టే ప్రక్రియను పూర్తిగా ఆపలేదని, కేవలం నెమ్మదింపజేస్తుందని ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ వివరించారు. పిండిలో ఉండే ఈస్ట్ , బ్యాక్టీరియా కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తూనే ఉంటాయి. దీనివల్ల 24 గంటల తర్వాత పిండి రుచి, వాసన , ఆకృతి మారిపోతాయి. పిండి జిగటగా లేదా పుల్లగా మారితే అది వాడటానికి ఏమాత్రం సురక్షితం కాదని అర్థం చేసుకోవాలి.
జీర్ణ సమస్యలు , పోషకాల లోపం
24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచిన పిండితో చేసిన రొట్టెలు తినడం వల్ల గ్యాస్ , కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిల్వ ఉన్న పిండితో చేసిన రొట్టెలు మెత్తగా ఉండవు, ఫలితంగా అవి జీర్ణం కావడానికి మన శరీరం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అంతేకాకుండా, పిండిని నిల్వ చేయడం వల్ల దానిలోని పోషక విలువలు గణనీయంగా తగ్గిపోతాయి. అటువంటి రొట్టెలు తినడం వల్ల కడుపు నిండుతుందే తప్ప, శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు లభించవు.
మధుమేహ రోగులకు పొంచి ఉన్న ముప్పు
నిల్వ ఉంచిన పిండి వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. ఫ్రిజ్‌లో ఉంచిన పిండిలోని పిండిపదార్థం (స్టార్చ్) వేగంగా విచ్ఛిన్నమవుతుంది. దీనివల్ల ఆ పిండితో చేసిన రొట్టెలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే, మధుమేహ వ్యాధిగ్రస్తులు (Diabetic patients) నిల్వ ఉంచిన పిండితో చేసిన రొట్టెలను అస్సలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు తాజాగా కలిపిన పిండితోనే రొట్టెలు చేసుకోవడం ఉత్తమ పద్ధతి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల నిల్వ చేయాల్సి వస్తే, సాధ్యమైనంత తక్కువ సమయం మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచి, త్వరగా వాడేలా ప్లాన్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆరోగ్యం విషయంలో మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు.
