చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ D, విటమిన్ B2 (రైబోఫ్లావిన్), ఐరన్, జింక్, అయోడిన్, మ్యాగ్నీషియం, పొటాషియం వంటి అత్యవసర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు, మెదడు పనితీరును గణనీయంగా మెరుగుపరచడంలో కూడా ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. పరిశోధనల ప్రకారం ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మతిమరుపు సమస్యలను తగ్గించడంలో, మానసిక చురుకుదనాన్ని పెంచడంలో సహాయపడతాయి. గర్భిణీలు, పిల్లల్లో మెదడు అభివృద్ధికి కూడా చేపలు ఎంతో ఉపయోగకరం.
నిత్యం చేపలు తినే వారికి డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, మానసిక అలసట వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు వారానికి కనీసం రెండు సార్లు చేపలు తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడే అవకాశముందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అలాగే చేపల్లో విస్తారంగా ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కంటి చూపును మెరుగుపరచడంలో, వయసుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. మొత్తం మీద రెగ్యులర్‌గా చేపలు తినే వ్యక్తులు ఇతరులతో పోలిస్తే అనారోగ్యాలకు తక్కువగా గురవుతారని, రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చేపలు తినడం మంచిదా అనే విషయంపై న్యూట్రిషియన్ లేదా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.