చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పుష్కలంగా పోషకమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఉదయం రోజును ఆరోగ్యకరమైన పానీయంతో ప్రారంభిస్తే శరీర వికాసం మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతుంది. చాలామంది రోజును టీ, కాఫీతో ప్రారంభిస్తారు. ఇవి తరచూ తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది. వీటి బదులుగా, ఉదయాన్ని చియా సీడ్స్ వాటర్‌తో మొదలుపెట్టడం ఎంతో మేలు చేస్తుంది.
చియా గింజల్లో ఫైబర్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి అనేక ముఖ్య పోషకాలు ఉండి శరీరాన్ని పలు వ్యాధుల నుంచి రక్షిస్తాయి. చియా సీడ్స్ వాటర్ బరువు తగ్గడంలో సహాయపడటంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని అధిక ఫైబర్ వల్ల పేగులు శుభ్రపడటంతో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపులు (ఇన్ఫ్లమేషన్) తగ్గించడంలో సహాయపడతాయి.
చియా గింజల్లోని కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ప్రోటీన్ ఎముకల సాంద్రతను పెంచి బలంగా చేసే గుణం కలిగి ఉండటంతో ఆస్టియోపోరోసిస్ ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఉన్న ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలు కండరాలను బలపరుస్తాయి. గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు చియా సీడ్స్ ద్వారా లభిస్తాయి. అయితే ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి తగిన విధంగా చియా సీడ్స్‌ను ఎలా, ఎంత తీసుకోవాలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా న్యూట్రిషన్ నిపుణుడిని సంప్రదించండి.