అన్నంతో ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. టమోటా రైస్, పుదీనా రైస్, కరివేపాకు రైస్.. ఇలా కొత్త కొత్తగా ఎన్నో రకాల రైస్ లను మనం రెగ్యూలర్ గా చేస్తూ ఉంటాం.. కానీ కొత్తగా గోంగూర రైస్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవల్.. వింటుంటేనే నోరు ఊరుతుంది కదా.. ఇక గోంగూరతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చక్కగా ఉంటుంది. నిమిషాల వ్యవధిలోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ గోంగూర రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…
కావలసిన పదార్థాలు :
అన్నం – పావు కిలో,
గోంగూర – 2 గుప్పెళ్లు,
నూనె – 2 టీ స్పూన్స్,
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్,
బిర్యానీ ఆకు – 1,
దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క,
యాలకులు – 3,
లవంగాలు – 4,
సాజీరా – అర టీ స్పూన్,
జాపత్రి – కొద్దిగా,
జీలకర్ర – అర టీ స్పూన్,
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1,
తరిగిన పచ్చిమిర్చి – 3,
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,
కరివేపాకు – ఒక రెమ్మ,
తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్,
తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్,
చిన్నగా తరిగిన టమాటాలు – 2,
ఉప్పు – తగినంత,
కారం – 2 టీ స్పూన్స్,
పసుపు – అర టీ స్పూన్,
ధనియాల పొడి – ఒక టీ స్పూన్,
గరం మసాలా – అర టీ స్పూన్…
తయారీ విధానం :
ముందుగా ఉడికించిన అన్నాన్ని చల్చార్చు కోవాలి.. పొడిగా ఉండేలా చూసుకోవాలి..తరువాత కళాయిలో గోంగూరను వేసి మంటను చిన్నగా చేసి మూత పెట్టి మగ్గించాలి. గోంగూర మగ్గిన తరువాత గంటెతో అంతా కలుపుకుని గోంగూరను మెత్తగా చేసుకోవాలి. దీనిని జార్ లో మెత్తగా పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి.. ఆ తర్వాత మసాలా దినుసులు, తాలింపు గింజలను వేసి బాగా వేగనివ్వాలి.. ఒక్క నిమిషం అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యేవరకు వేగనివ్వాలి.. ఆ తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. వీటిని నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తబడే వరకు సిమ్ లో మగ్గనివ్వాలి..టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమం వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. అన్నం అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.. అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర రైస్ రెడీ అయ్యినట్లే.. ఎంతో సింపుల్ గా అయిన ఈ రైస్ ను మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి..