Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!

Ragi Ganji

Ragi Ganji

Ragi Health Benefits: రాగి ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. ప్రోటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే రాగిని తింటే కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. అందుకే ఫిట్‌నెస్ ప్రేమికుల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. ఎముకలను బలంగా ఉంచే క్యాల్షియం, జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ రాగిలో సమృద్ధిగా ఉంటాయి. గ్లూటెన్-ఫ్రీ కావడంతో గోధుమలు పడని వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం. అయితే, రాగిని మనం ఎలా వండుకుని తింటున్నామనే దానిపైనే మన శరీరానికి అందే పోషకాలు ఆధారపడి ఉంటాయి. చాలామంది రాగిని సరైన పద్ధతిలో తినక పొరపాట్లు చేస్తుంటారు.

రాగిలో ఉండే ఫైటేట్స్, టానిన్లు అనే కాంపౌండ్లు క్యాల్షియం, ఐరన్లను పట్టి ఉంచుతాయి. దీనివల్ల శరీరం ఆ పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. పొడి పొడిగా ఉన్న రాగి రొట్టెలు లేదా డ్రై దలియా తినడం, రాగిని సరిగ్గా ఉడికించకుండా పచ్చి వాసన వచ్చేలా అరకొరగా ఉడికించి తినడం, రాగి తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం, మైదా-చక్కెర కలిపిన రాగి కుకీస్ తినడం లాంటివి మనం చేసే పెద్ద పొరపాట్లు. వీటివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా రాగి నుంచి రావలసిన అసలైన పోషకాలు లభించవు. రాగిని సరైన పద్ధతిలో తింటేనే దాని పూర్తి ప్రయోజనాలు అందుతాయి. రాగి పిండిని మజ్జిగలో లేదా పెరుగు నీళ్లలో కలిపి రాత్రింబవళ్లు (సుమారు 8 నుంచి 10 గంటలు) నానబెట్టి పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయం దాంతో దోసె, అంబలి లేదా జావ (కూజ్) చేసుకోవచ్చు. మొలకెత్తించిన రాగి పిండిని వాడటం కూడా చాలా మంచిది. రాగిని కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. అది జిగటగా, మెరుస్తూ (glossy), పచ్చి వాసన పూర్తిగా పోయేంత వరకు ఉడకాలి. సరిగ్గా ఉడికిన తర్వాత కాస్త చల్లారాక అందులో కొద్దిగా నిమ్మరసం, ఒక చెంచా నెయ్యి లేదా కరివేపాకు చేర్చుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యమూ లభిస్తుంది.

రాగిని ఉదయం అల్పాహారంలో లేదా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం అత్యుత్తమం. వారానికి 3 నుంచి 4 సార్లు ఒక చిన్న కప్పు పరిమాణంలో తింటే సరిపోతుంది. రాగి తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగడానికి మధ్య కనీసం ఒక గంట విరామం ఉండాలి, లేదంటే అవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. రాత్రి సమయంలో పొడి రొట్టెలు కాకుండా తేలికగా అరిగే జావ లేదా దలియా రూపంలోనే తీసుకోవాలి. ఈ విధంగా పులియబెట్టి, బాగా ఉడికించి తినడం వల్ల ఫైటేట్స్ తగ్గి, క్యాల్షియం సులభంగా జీర్ణమవుతుంది. ఫలితంగా కడుపు తేలికగా ఉండి, ఎక్కువ సేపు శక్తి లభిస్తుంది. సరిగ్గా వండుకుని తింటే రాగిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలకు, ఐరన్ హిమోగ్లోబిన్ తయారీకి ఎంతగానో తోడ్పడతాయి. అయితే, కేవలం రాగి మాత్రమే తింటే అన్ని పోషకాల లోపాలు తీరిపోవనుకోవడం పొరపాటు, దీనితో పాటు సమతులాహారం (బ్యాలెన్స్‌డ్ డైట్) తీసుకోవడం చాలా ముఖ్యం. రాగి ఎంతో పౌష్టికాహారమే అయినప్పటికీ, దాన్ని ఏదో వ్యాధిని నయం చేసే మందుగా భావించకూడదు. ఒకవేళ మీకు నిరంతరం గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు ఉంటే కేవలం ఆహారంలో మార్పులు చేయడమే కాకుండా డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.