చలికాలంలో జట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో వీచే చలి, గాలుల కారణంగా తల చర్మం పొడిగా మారుతుంది. దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారవచ్చు. చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి. ఈ మూడు రకాల నూనెలు జుట్టు, స్కాల్ప్ రెండింటికి పోషణను అందిస్తాయి. చుండ్రు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
రోజ్మేరీ ఆయిల్..
జుట్టు చాలా బలహీనంగా, మూలాల నుంచి సన్నగా ఉంటే వెంట్రుకలు రాలిపోతాయి. ఇలాంటి సందర్భంలో రోజ్మేరీ నూనెను జుట్టుకు అప్లై చేసి చూడండి. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రోజ్మరి నూనె స్కాల్ప్‌ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఇది జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అందించి జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. క్రమక్రమంగా మీకు ఒత్తైన జుట్టు లభిస్తుంది. అయితే రోజ్మేరీ నూనెను కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అర టీస్పూన్ కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల రోజ్‌మేరీ ఆయిల్ కలపండి. దీన్ని తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.
లెమన్ గ్రాస్ ఆయిల్..
లెమన్ గ్రాస్ ఆయిల్ జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే లెమన్ గ్రాస్ నూనెను జుట్టుకు పట్టించాలి. కొన్నిసార్లు జుట్టులో చుండ్రు సమస్య కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. అలాంటపుడు లెమన్ గ్రాస్ ఆయిల్ రాయటం వలన స్కాల్ప్ డ్రైనెస్ అనేది పోతుంది. మంచి పోషణ లభించి జుట్టు పెరుగుతుంది. షాంపూ లేదా కండిషనర్లో 4-5 చుక్కల లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపి తలకు పట్టిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
గంధపు నూనె..
జుట్టు చాలా జిడ్డుగా, జిగటగా ఉంటే కూడా రాలిపోవటానికి దారితీస్తుంది. ఇలాంటి జుట్టు కలిగిన వారు గంధపు నూనె రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది తలపై నూనెను ఉత్పత్తి చేసే గ్రంధులను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల జుట్టులో దురద, చుండ్రు, జిగట సమస్యలు తీరిపోతాయి. మెరుగైన ఫలితాల కోసం కొబ్బరినూనె లేదా ఆముదం నూనెలో కొన్ని చుక్కల గంధపు నూనెను మిక్స్ చేసి తలకు పట్టించాలి. దీంతో మెరుగైన ఫలితం లభిస్తుంది.