Kidney Disease: సాధారణంగా జీవన విధానంలో మార్పులతో చాలా మంది మధుమేహం బారినపడుతున్నారు. మదుమేహం లేని వారు లేరంటే ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. అన్ని వయసుల వారిలోనూ డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలోని మధుమేహ రోగులలో 17 శాతం మన ఇండియాలోనే ఉన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచ మధుమేహ రాజధానిగా మారిపోయింది. కానీ ఇపుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మూత్రపండానికి మధుమేహ గండం ఏర్పడింది. అదేంటీ మూత్రపిండానికి మధుమేహానికి సంబంధం ఏమిటీ.. మధుమేహంతో మూత్రపిండానికి ఇబ్బంది ఏమిటని అనుకుంటున్నారు కదా.. సంబంధం ఎలా ఉంది చూడండి.. ఇండియన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ (ఐసీకేడీ) తాజా అధ్యయనం ప్రకారం..క్రానిక్ కిడ్నీ వ్యాధి (సీకేడీ)కి ప్రధాన కారణం డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని తేలింది. దీర్ఘకాలిక మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధి కేసులలో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వాటా 24.9 శాతంగా ఉంది. ఈ వ్యాధిని డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న రోగులు మూత్రంలో ప్రొటీన్లను కోల్పోతారు. సత్వరమే చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read also: Venu Yeldandi : తన రెండవ సినిమా పనులు మొదలు పెట్టిన దర్శకుడు వేణు..
వివిధ ఆరోగ్య సమస్యల వల్ల పాడైపోయిన మూత్రపిండాలు.. సమర్థంగా రక్తాన్ని వడ బోయలేని పరిస్థితినే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. దీనివల్ల శరీరంలోని ద్రవాలు (ఫ్లూయిడ్స్), రక్తంలోని వ్యర్థాలు బయటికి వెళ్లలేవు. ఒంట్లోనే పేరుకుపోతాయి. ఈ పరిస్థితి మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రత్యేకించి మధుమేహ రోగుల్లో కిడ్నీల పనితీరు మందగించడాన్ని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్‌గా పేర్కొంటారు. రక్తంలో నియంత్రించలేనంతగా చక్కెర స్థాయులు ఉన్నవారిలో, అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) పీడితుల్లో, ధూమపాన ప్రియుల్లో, అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నవారిలో, ఊబకాయుల్లో, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు వారసత్వంగా ఉన్న మధుమేహ రోగులలో.. ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే తొలిదశలో ఎలాంటి లక్షణాలూ బయటపడవు. అంతా సాధారణంగానే కనిపిస్తుంది. వ్యాధి ముదురుతున్న సమయంలోనే ఆకలి మందగించడం, వికారం, వాంతులు, ఎంతకూ తగ్గని దురద ఉండటం. అలసట ఇబ్బంది పెడతాయి. రక్తపోటు (బీపీ) నియంత్రణ అసాధ్యం అవుతుంది. ప్రొటీన్లను కోల్పోతూ ఉండటం వల్ల నురగలా వచ్చే మూత్రం, పాదాలు, మడమలు, చేతులు, కండ్లు తదితర భాగాల్లో వాపు రావడం, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పడి పోవడం (హైపోైగ్లెసీమియా), శ్వాస మంద కొడిగా సాగడం.. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఎప్పుడో కానీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ సమస్యలు బయటపడవు. క్రమంగా శరీర కణజాలంలో ద్రవాలు నిండిపోవడం (ఫ్లూయిడ్ రిటెన్షన్), రక్తంలో పొటాషియం పెరగడం (హైపర్‌కెలీమియా), గుండె, మెదడు, కండ్లు, కాళ్లకు సంబంధించిన రక్త నాళాలు దెబ్బతినడం.. మొదలవుతుంది. ఈ ప్రభావాల మూలంగా గుండెపోటు, పక్షవాతం, చూపు తగ్గడం, పాదాల్లో అల్సర్లు లాంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ పడిపోతుంది, ఎముకలు బలహీనపడతాయి. కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్పనిసరి అవుతుంది.
Diabetes: Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..
మధుమేహ సమస్యను తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడమే డయాబెటిస్ కిడ్నీ డిసీజ్ నివారణకు ఏకైక మార్గం. సమస్య తీవ్రత తెలుసుకోవడానికి మూడు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. సీరం క్రియాటినైన్ రక్త పరీక్ష/ ఎస్టిమేటెడ్ గ్లోమెర్యులార్ ఫిల్ట్రేషన్ రేట్ (ఈజీఎఫ్‌ఆర్). ప్రొటీన్లు, రక్తకణాలు మూత్రం నుంచి బయటికి వెళ్తున్నాయనేది నిర్ధారించేందుకు మూత్రపరీక్ష. కిడ్నీల పరిమాణం, ఇతర అంశాలు తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ పరీక్షల ద్వారా దీనిని గుర్తించవచ్చు. డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ముప్పు ఉన్నవాళ్లు మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి షుగర్, కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటిస్ లేనివాళ్లయితే.. కిడ్నీల్లో సమస్యల నిర్ధారణకు ఏడాదికోసారి పరీక్షలు చేయించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని సూచించింది. కానీ భారతదేశంలో కనీసం 10 నుంచి 12 గ్రాముల ఉప్పు వాడుతున్నారని అంచనా. ఊరగాయలు, బిర్యానీలు, వీధుల్లో అమ్మే చిరుతిండ్లు, శీతలీకరించిన ఆహారాల వల్ల ఉప్పు పరిమాణం ఇంకా పెరుగుతున్నది. ఉప్పును పరిమితం చేయగలిగితే.. డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ బాధితుల్లో శరీరంలో ఫ్లూయిడ్ రిటెన్షన్ సమస్య ఏర్పడకుండా చూడవచ్చు. దీంతో వ్యాధి మరింత తీవ్రం కాకుండా ఉంటుంది.