చలికాలం ప్రారంభం కానుంది. చలి ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవడానికి చాలా మంది చ్యవాన్‌ప్రాష్‌ని తీసుకుంటారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన అనేక చ్యవన్‌ప్రాష్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అనేక ఆయుర్వేద చ్యవన్‌ప్రాష్‌లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. భారత దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద లేహ్యం చ్యవన్ ప్రాష్. దీన్ని ఎప్పటి నుంచో పిల్లలకు పెడుతూ వస్తున్నారు. ఆరోగ్య అవసరాల రీత్యా కొందరు పెద్దలూ దీన్ని తింటూ ఉంటారు. బలహీనంగా, ఎప్పుడూ శ్వాస కోశ వ్యాధులతో బాధ పడుతూ ఉండే పిల్లల్ని చూసినప్పుడు వైద్యులు ఇప్పటికీ దీన్ని పెట్టమని సిఫార్సు చేస్తుంటారు. అందుకనే ఇప్పుడిది రకరకాల బ్రాండ్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. తేనె, నెయ్యి, ఉసిరి, లవంగ లాంటి దాదాపు 50 రకాల ఆయుర్వేద ద్రవ్యాలను వాడి జామ్‌లా దీన్ని తయారు చేస్తారు. ఇది తియ్యగా, పుల్లగా, మసాలా ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. మరి అసలు ఇది తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఎంత తినొచ్చు. లాంటి విషయాలన్నింటినీ ఇక్కడ చూసేద్దాం.
READ MORE: Devara: హిట్ అయినా తగ్గేదేలే!
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావడానికి ఇది పనికి వస్తుంది. ఇందుకు అవసరమైన కణాల ఉత్పత్తి, వాటి పని తీరును ఇది మెరుగుపరుస్తుంది. దీనిలో ముఖ్యంగా ఉండే ఉసిరికాయలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. పిల్లలు బలంగా ఎదిగేందుకు సహకరిస్తుంది. జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని బలోపేతం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యల్లాంటి వాటిని తగ్గించి పిల్లల్లో అరుగుదలను పెంచుతుంది. నోటి దగ్గర మొదలై, మల ప్రేగు చివరి వరకు ఉన్న జీర్ణ వ్యవస్థ పని తీరు మొత్తాన్ని ఇది క్రమబద్ధీకరిస్తుంది. దీంతో ఏం తిన్నా చక్కగా అరిగి శరీరానికి పడుతుంది. కాలాలు మారుతున్నప్పుడు సహజంగానే మనకు వైరల్ ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులూ తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమస్య పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటుంది.
దీన్ని క్రమం తప్పకుండా రోజూ తింటూ ఉండటం వల్ల ఇలాంటి సీజనల్ వ్యాధులు దరి చేరవు. వాత, పిత్త, కఫ దోషాలు శరీరంలో ప్రకోపించకుండా చూస్తుంది. ఈ మూడూ సరిగ్గా ఉండి శరీర పని తీరుకు అవి సహకరించేలా తోర్పడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవద్దు. సాధారణ వ్యక్తి రోజుకు ఉదయం ఒక టీ స్పూను, సాయంత్రం ఒక టీ స్పూను చొప్పున రెండు స్పూన్ల వరకు తినొచ్చు. అలాగే పిల్లలైతే అర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవచ్చు. వేరే ఏమైన ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సూచనల మేరకు వాడటం మంచిది.