గడ్డం పెంచుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. గడ్డం పెంచితే మంచిది కాదు అనే అపోహ చాలా మందిలో ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కూడా మారుతున్నారు. కొత్త కొత్త ట్రెండ్‌లను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు గడ్డం పెంచే ట్రెండ్ నడుస్తున్నది. గడ్డం పెంచడం వల్ల చాలా లాభాలున్నాయి. అందులో ముఖ్యంగా 5 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
1. చర్మ క్యాన్సర్ నుంచి రక్షణ
దక్షిణ క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగిన ఓ పరిశోధన ప్రకారం.. గడ్డం పెంచుకోవడం వల్ల సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి 95 శాతం రక్షిస్తుంది. ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పరిశోధకులు దీనిని సన్‌స్క్రీన్ లా ప్రభావ వంతంగా ఉంటుందని భావిస్తున్నారు.
2. మెరిసే చర్మం
గడ్డం ఉంచుకోవడం వల్ల చర్మాన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుందని ఒహియో స్టేట్ వెక్స్నర్ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. ఇది మొటిమలు, మచ్చలు లేదా దద్దుర్లు రాకుండా నివారిస్తుందని వెల్లడించారు. షేవ్ చేసిన చర్మం కంటే గడ్డం ఉన్న చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుందని తెలిపారు.
3. అలెర్జీల నుంచి రక్షణ..
ముక్కులోని వెంట్రుకలు అలెర్జీ కణాలు, కాలుష్యాన్ని లోనికి ప్రవేశించకుండా నిరోధిస్తున్నట్లే, గడ్డం అలెర్జీని కలిగించే కణాలు లేదా కలుషితమైన మూలకాలు చర్మంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందట. న్యూయార్క్ మెడికల్ సెంటర్‌లోని అలెర్జీ, ఆస్తమా సెంటర్ నిపుణులు గడ్డం కాలుష్య కణాలు లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుందని తెలిపారు. రోజూ శుభ్రం చేయడం ముఖ్యమని నొక్కిచెప్పారు.
4. ఆకర్షణ పెరుగుతుంది
ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. గడ్డం ఉన్న పురుషుల పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. గడ్డం ఉన్న యువకులను ఎక్కువగా లైక్ చేస్తారట.
5. ముడతలు రావు..
గడ్డం ఎక్కువగా ఉండటం వల్ల ముఖంపై ఎక్కువగా ముడతలు రాకుండా ఉంటాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు. ముఖంపై ఎక్కువగా దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి.