రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళిక రచించారు. ఈ ప్రణాళికపై గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా అధికారులు చర్చించారు. వారం రోజుల్లో ప్రణాళికను అంగీకరించాల్సిందేనని అల్టిమేటం విధించారు. దీంతో ఈ ప్రణాళికపై ట్రంప్‌తో మాట్లాడతానని జెలెన్‌స్కీ బదులిచ్చారు. 28 పాయింట్ల ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్‌కు చెందిన చాలా ప్రాంతాలను వదులుకోవాల్సి ఉంటుంది. అందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అవసరమైతే అమెరికాతో సంబంధాలు కూడా తెంచుకునేందుకు కూడా జెలెన్‌స్కీ సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్తానని.. అవసరమైతే మిత్రులను కూడా వదులుకుంటామని పరోక్షంగా జెలెన్‌స్కీ సంకేతాలు ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఇదిలా ఉంటే ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికకు పుతిన్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికను ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని పుతిన్ చెబుతున్నారు. ఉక్రెయిన్, నాటో దేశాలు భ్రమల్లోంచి బయటకు రావాలని పేర్కొన్నారు. యుద్ధంలో రష్యాను ఓడించగలమని కలలు కంటున్నారని విమర్శించారు. యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా ఉందని.. ట్రంప్ ప్రణాళికపై వివరణాత్మక చర్చకు అంగీకరిస్తున్నామని.. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం యుద్ధం కొనసాగిస్తామని పుతిన్ హెచ్చరించారు.

2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ సఫలీకృతం కావడం లేదు. తొలుత సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది.. అయినా కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో శాంతి చర్చలు జరిపారు. అనంతరం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీతో కూడా చర్చలు జరిపారు. ఈ చర్చలు కూడా ఫెయిల్ అయ్యాయి.
తాజాగా మరోసారి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఈ ప్రణాళికతోనైనా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం కైవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని అమెరికా సైన్య కార్యదర్శి డాన్ డ్రిస్కాల్ కలిశారు. రష్యా ఏం కోరుతుందో దానికి అంగీకారం తెల్పాలని జెలెన్‌స్కీపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
ట్రంప్ ప్రణాళిక ప్రకారం.. ఉక్రెయిన్.. డాన్‌బాస్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. అలాగే సైన్యాన్ని 600, 000 మందికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక ఉక్రెయిన్‌ను రక్షించడానికి యూరోపియన్ ఫైటర్ జెట్‌లు పోలాండ్‌లో మాత్రమే ఉంటాయి. అలాగే ఉక్రెయిన్‌లో ఎలాంటి నాటో దళాలు కూడా ఉండవు. దీంతో ఈ ప్రణాళికను అంగీకరించడానికి జెలెన్‌స్కీ ఏ మాత్రం సానుకూలంగా లేనట్లుగా కనిపిస్తోంది.
ఆ మధ్య ఇజ్రాయెల్-గాజా మధ్య ట్రంప్ 10 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఇది అద్భుతంగా విజయవంతం అయింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొంది. ఇప్పుడు తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఇది కూడా విజయవంతం అయ్యేలా అమెరికా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ శాంతి చర్చలు ఫలిస్తే.. ట్రంప్ మంచి క్రెడిట్ సంపాదిస్తారు. కానీ జెలెన్‌స్కీ మాత్రం ఈ ప్రణాళికను అంగీకరించే పరిస్థితుల్లో లేనట్లుగా కనిపిస్తోంది.