చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత తొలిసారి జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రాబోతున్నారు. సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాల్సిందిగా జిన్‌పింగ్‌కు భారత్ ఆహ్వానం పంపింది. అయితే భారత్ పర్యటనకు జిన్‌పింగ్ సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. గల్వాన్ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కనిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో జిన్‌పింగ్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్రిక్స్ కూటమికి ఈ ఏడాది భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలకు చైనా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. జిన్‌పింగ్ ఢిల్లీలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని ఈ పరిణామాలపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపినట్లు సమాచారం. అయితే జిన్‌పింగ్ భారత పర్యటనపై ఇప్పటివరకు చైనా లేదా భారత్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ బ్రిక్స్ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడికి భారత్ ఇప్పటికే అధికారిక ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదిక అని పేర్కొన్నారు. బ్రిక్స్ సహకారానికి చైనా అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కూటమి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని తెలిపారు. ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్.. శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చైనా పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి జిన్‌పింగ్ హాజరుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జిన్‌పింగ్ భారత్‌కు వస్తే.. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత ఆయన చేపట్టే తొలి భారత పర్యటనగా ఇది నిలవనుంది. చివరిసారిగా జిన్‌పింగ్ 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో తమిళనాడులోని మామల్లపురంలో ప్రధాని మోడీతో రెండో అనధికారిక శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. అనంతరం 2020లో గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ప్రధాని మోడీ 2025లో చైనాలో పర్యటించారు. టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత్‌కు వచ్చే అవకాశం ఉందని క్రెమ్లిన్ ఇప్పటికే ధ్రువీకరించింది. బ్రిక్స్ సభ్యదేశమైన ఇరాన్ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇరాన్ నుంచి ఏ స్థాయి ప్రతినిధి బృందం హాజరవుతుందన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ కూడా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో అత్యున్నత స్థాయిలో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరుకావాలని బంగ్లాదేశ్ ప్రధానికి ప్రధాని మోడీ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వానాన్ని ప్రస్తుతం సమీక్షిస్తున్నామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహ్మాన్ బుధవారం తెలిపారు.
బ్రిక్స్ కూటమిలో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ దేశాలు బ్రిక్స్‌లో చేరాయి. 2025లో ఇండోనేషియా కూడా కూటమిలో సభ్యత్వం పొందింది. ప్రస్తుతం విస్తరించిన బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుండటంతో.. సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సమావేశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

