Woman Gets Stuck Upside Down In Gym While Working Out: అమెరికాకు చెందిన ఓ మహిళకు జిమ్‌లో ఒక వింత ఘటన ఎదురైంది. బరువు తగ్గాలనుకొని జిమ్‌కి వెళ్లి వ్యాయామం మొదలుపెడితే, అది బెడిసికొట్టింది. ఆ దెబ్బకు ఆమె తలక్రిందులుగా ఇరుక్కుంది. దాన్నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, చివరికి పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి, ఆమెను కాపాడాల్సి వచ్చింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఓహియోకు చెందిన ఆ మహిళ పేరు క్రిస్టిన్ ఫాల్డ్స్. తాను బరువు ఎక్కువగా ఉండటంతో, బరువు తగ్గించుకునేందుకు జిమ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల అర్థరాత్రి మూడు గంటలకు జిమ్‌కి వెళ్లింది.
ఇన్వర్షన్ టేబుల్‌పై వ్యాయామం చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఉయ్యాల తరహాలో ఊగుతూ ఉంటుంది. దీనిపై వ్యాయామం చేస్తున్నప్పుడు, అది ఒక్కసారిగా తిరగబడింది. దీంతో.. ఆమె అందులో తలక్రిందులుగా ఇరుక్కుపోయింది. బయటపడేందుకు క్రిస్టిన్ ప్రయత్నించింది కానీ, పాదాల భాగంలో కదలిక లేనంతగా చిక్కుకుపోవడంతో బయటపడలేకపోయింది. జిమ్‌లో ఎవరి సహాయమైన కోరుదామంటే, ఆ సమయంలో ఎవ్వరూ లేరు. దీంతో, తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ సాయంతో ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేసింది. జిమ్‌లో తాను ఇరుక్కుకున్నానని, కాపాడాలని కోరింది. అప్పుడు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, క్రిస్టిన్‌ను కాపాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. తమ జీవితంలో అత్యంత సులువుగా రక్షించిన ఘటన ఇదేనంటూ నవ్వుతూ చెప్పారు. ఎందుకంటే, ఇక్కడ పోలీసులకు ఎక్కువ కష్టపడాల్సి రాలేదు. కేవలం క్రిస్టిన్ ఇరుక్కున్న పరికరంలో కాళ్లవైపు ఉన్న భాగాన్ని పట్టుకొని, కిందకు జరిపారంతే! జస్టిన్ లావుగా ఉండటం వల్ల, ఆ పరికరంలో ఇరుక్కుపోయి, సాధారణ పొజిషన్‌లోకి రాలేకపోయిందంతే!